Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తన నియోజకవర్గంలో వైరస్ నివారణ ఔషధం 'ఫాబిఫ్లూ'ను ఉచితంగా పంపిణీ చేస్తామన్న బీజేపీ ఎంపి గౌతమ్ గంభీర్ ప్రకటన వివాదస్పదమైంది. ఈ ప్రకటనపై ఆప్, కాంగ్రెస్‌లు విమర్శనాస్త్రాలు సంధించాయి. విపత్కర పరిస్థితుల్లో ఇమేజ్ను పెంచుకునేందుకు ఇటువంటి ప్రకటనలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. కరోనా చికిత్సలో వినియోగించే రెమిడెసివిర్, ఫాబిఫ్లూ, అత్యవసర మందులు మార్కెట్లో లభించడం లేదని, ఈ ఔషధాలను బీజేపీ నేతలు అక్రమంగా నిల్వ చేసుకున్నారని ఆప్ విమర్శించింది. గుజరాత్లో కూడా ఇటువంటి ఘటనను చూశామని, అందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారంటూ ఆప్ నేత రాజేష్ శర్మ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన నేరపూరితమైనదని మరో నేత సోమ్‌నాథ్ భాత్రి పేర్కొన్నారు. తన ఇమేజ్ను పెంచుకునేందుకు ఈ విధంగా ప్రకటనలు ఇవ్వడం నేరం కింద పరిగణించబడుతుందని, ఆ ఔషధాలను ఆస్పత్రులకు పంపిణీ చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ ఔషధ పంపిణీ చట్టబద్ధమేనా అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. మార్కెట్లో కొరతగా ఉన్న ఫాబిఫ్లూ ఔషధాన్ని పంపిణీ చేస్తామంటూ ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు.