Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
న్యూఢిల్లీ: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వివక్షాపూరితంగా, పక్షపాతంతో కూడుకుందని విమర్శించారు. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి మోడీకి ఆమె లేఖ రాశారు. దేశ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్ అందివ్వాలన్న బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు. దేశ యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను మరచినట్లు స్పష్టంగా తెలుస్తోందని దుయ్యబట్టారు. 'కరోనా వైరస్ మహమ్మారి గత ఏడాది నుంచి పౌరులకు కఠినమైన బాధలను కలిగిస్తూనే ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష, పక్షపాత విధానాలను అనుసరిస్తూనే ఉంది. ఇలాంటి నిర్ణయాలు ఇప్పటికే ఉన్న సవాళ్లను మరింత పెంచుతాయి' అని ఆ లేఖలో పేర్కొన్నారు. 'మూడో విడత వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా తయారీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి 50శాతం కరోనా టీకా డోసులు అందించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు వ్యక్తులకు మరో 50శాతం డోసులను సరఫరా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కోవిషీల్డ్ టీకాను కేంద్ర ప్రభుత్వానికి డోసుకు రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేటుకు రూ.600గా ధరను నిర్ణయిస్తు న్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఇలా భిన్న ధరలను నిర్ణయించడం సరికాదు' అని పేర్కొన్నారు. ఒకే కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌కు మూడు రకాల ధరను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సామాన్య పౌరులు టీకాల కోసం భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకూ తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకొని, అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించాలని కోరారు.