Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియాను వణికిస్తోంది. కేసుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించేలా చేసింది. ఒకే రోజులో ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఇంత భారీగా పెరిగిపోవడానికి కారణమైన ఆ డేంజరస్ వేరియంట్ బి.1.617 మూలాలపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మహారాష్ట్రలోని అమరావతిలోనే పుట్టినట్టు ఒక థియరీ చెబుతోంది. బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు పూర్తి భిన్నంగా ఉన్న ఈ ఇండియన్ వేరియంట్‌పై ఇప్పుడు ప్రపంచం దృష్టి సారించింది. ఇంటర్నేషనల్ మీడియా విదర్భపై ఫోకస్ పెట్టింది. అమరావతిలో ఈ వేరియంట్ వల్లే కేసులు పెరిగి ఉండొచ్చని అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ నితిన్ షిండే కూడా అభిప్రాయపడ్డారు. అయితే పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇప్పుడే దీనిపై ఓ అంచనాకు రాలేమని చెబుతున్నారు.ఈ బి.1.617 వేరియంట్‌నే డబుల్ మ్యుటెంట్‌గా పిలుస్తున్నారు. ఇందులో గమనించాల్సిన మ్యుటేషన్లు ఇ484క్యూ, ఎల్425ఆర్ ఉన్నాయని.. వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి ఇవే కారణమని మరో డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్పారు. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో సీనియర్ డాక్టర్. నిజానికి ఈ డబుల్ మ్యుటెంట్‌ను ఈ సెకండ్ వేవ్ ప్రారంభానికి చాలా ముందే కనుగొన్నారని, అందువల్ల సెకండ్ వేవ్‌కు పూర్తిగా ఇదే కారణమా అన్నదానిపై కచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు.
డిసెంబర్లోనే వెలుగులోకి..
ఈ బి.1.617 వేరియంట్ గత డిసెంబర్లోనే వెలుగులోకి వచ్చినట్టు ఇగ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా డేటా చెబుతోంది. ఆ నెలలో ఇండియాలో సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఇది బయటపడినట్టు తెలిపింది. 29 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ కనిపించిందని చెప్పింది. ఈ వేరియంట్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ కంట్రోల్ సలహా బందంలో ఉన్న డాక్టర్ అతుల్ గవాండే కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
20 శాతం వేగంగా..
గత వేరియంట్ కంటే ఇది 20 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్టు బెల్ఫాస్ట్లోని క్వీన్స్ యూనివర్సిటీ రీసెర్చర్ గ్రేస్ రాబర్ట్స్ చెప్పారు. అయితే దీని వల్ల మరణాలు పెరిగాయా అన్నదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ వేరియంట్‌పై కూడా భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్టు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలడం కాస్త ఊరట కలిగించే విషయం.