Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు- అల్లాడుతున్న రోగులు
బెంగళూరు ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం రేపుతున్నది. భారీ సంఖ్యలో వస్తున్న కరోనా కేసుల్ని పరిష్కరించేందుకు ఆస్పత్రులు, డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా ఆక్సిజన్ కొరత వారిని వేధిస్తోంది. నగరంలోని పలు ఆస్పత్రుల్లో నాలుగు రోజులుగా ఆక్సిజన్ నిల్వలు అడుగంటడం రోగులకు నరక యాతనకు గురిచేస్తోంది. ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. బెంగళూరు ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఆక్సిజన్ డిమాండ్ నేపథ్యంలో అదనపు డ్రగ్ కంట్రోలర్ కార్యాలయలో ఆక్సిజన్ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆక్సిజన్ కొరత సమస్యలు తీరుతాయని అధికారులు చెప్తున్నా క్షేత్రస్దాయిలో పరిస్దితి మాత్రం నానాటికీ దారుణంగా తయారవుతున్నది. ప్రభుత్వం అదనపు ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులోకి తెస్తున్నా అవి ఆస్పత్రులకు ఏమాత్రం సరిపోవడం లేదు. సాధారణ రోజుల్లో రోజుకు ఆస్పత్రికి పది సిలెండర్లు ఉంటే సరిపోయేవి. కానీ ఇప్పుడు వంద సిలెండర్లు ఇస్తున్నా సరిపోవడం లేదని ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం రోజుకు బెంగళూరు నగరంలోని ఆస్పత్రులకు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మరికొన్ని చోట్ల డిమాండ్‌కు తగిన సప్లై ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో స్టోరేజీ సామర్ధ్యం లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి లేదా మే మొదటి వారానికి బెంగళూరు ఆస్పత్రుల ఆక్సిజన్ డిమాండ్ 300 నుంచి 400 మెట్రిక్ టన్నులకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు వాడే ఆక్సిజన్‌ను వైద్య అవసరాల ఆక్సిజన్‌గా మార్చడం కూడా సమస్యగా మారుతోంది.