Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోస్ట్ ఆఫీసులకు కేంద్రం గైడ్లైన్స్ జారీచేసింది. కరోనాను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు పాక్షికంగా, పూర్తిగా లాక్డౌన్లు విధిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోస్టల్ సర్కిళ్ల అధిపతులు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించింది. జనం రద్దీ లేకుండా చూడటంతోపాటు తక్కువ సిబ్బందితో విధులు నిర్వహించాలని తపాలాఫీసులకు స్పష్టం చేసింది కేంద్రం. పోస్టాఫీసులను అత్యవసర సర్వీసుల కింద పరిగణిస్తున్నందున సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం విధించే లాక్డౌన్ మార్గదర్శకాలను పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించింది. ఈ మేరకు విస్త్రుత ప్రాతిపదికన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆ మార్గదర్శకాలేమిటంటే:
అన్ని ఆఫీసులు కొవిడ్-19 నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలి. తరుచుగా చేతులు కడుక్కోవాలి. శానిటైజర్లు వాడాలి. అన్ని వేళల్లో మాస్క్లు ధరించాలి. ఇతరులతో భౌతిక దూరం పాటించాలి.
పబ్లిక్ హాల్, కౌంటర్లు, కారిడార్లు, క్యాంటిన్లు, పార్కింగ్ స్థలాల వద్ద జనం రద్దీగా ఉండకుండా పోస్టాఫీసు అధిపతులు చర్యలు తీసుకోవాలి.
పోస్టల్ ఉద్యోగుల్లో 45 ఏండ్లు దాటిన వారంతా తప్పనిసరిగా కొవిడ్-19 ప్రభావాన్ని సమర్ధవంతంగా నియంత్రించడానికి వ్యాక్సికేషన్ చేయించుకోవాలి.
జనం రద్దీని నివారించడానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోస్టల్ సర్కిళ్ల అధిపతులు సిబ్బంది హాజరు వేళలను ఖరారు చేయాలి.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో కొద్దిశాతం సిబ్బందిని మాత్రమే వర్క్ ఫ్రం హౌంకు అనుమతించాలి. వర్క్ ఫ్రం హౌం సేవలందించే అధికారులు ఫోన్లో గానీ, ఈ-మెయిల్లో గానీ అందుబాటులో ఉండాలి. అవసరమైనప్పుడు ఆఫీసుకు హాజరు కావాలి. సాధ్యమైనంత వరకు సమావేశాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే నిర్వహించాలి. ఆఫీసు ప్రాంగణాలను తరుచుగా శానిటైజేషన్ చేయడంతోపాటు సరిగ్గా శుభ్రపరచాలి.
ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. సిబ్బంది బయో మెట్రిక్ విధానాన్ని కొనసాగించాలి. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రిజిస్టర్లలో హాజరు తాత్కాలికంగా నిలిపివేశారు.