Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత రాష్ట్రాలకు వలసకార్మికులు
- పనిచేయని మోడీ సందేశం
న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత దృష్ట్యా దేశంలో వలసకార్మికులు మళ్లీ ఇంటి బాటపడుతున్నారు. తమ సొంత రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో వలస కార్మికుల గతేడాది లాక్డౌన్ సమయంలో తమ ఇండ్లకు వెళ్లిన తీరు ప్రస్తుతం మళ్లీ కనిపిస్తున్నది. ఈనెల 20 జాతినుద్దేశిస్తూ మోడీ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. వలసకార్మికులు ఎక్కడ ఉన్నవారు అక్కడే తమ పనుల్లో ఉండాలని అభ్యర్థించారు. అయితే, మోడీ మాటలు మాత్రం వారిలో ఏ మాత్రం ధైర్యాన్ని కలిగించడంలేదనీ, అందుకే వారంతా ఇంటి ముఖం పడుతున్నారని సామాజిక కార్య కర్తలు ఆరోపించారు. గత లాక్డౌన్ సమయంలోనే వలస కార్మికుల పరిస్థితి గురించి కేంద్రం ఆలోచించి వారి భద్రత కు చర్యలు చెప్పి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గొరెగావ్లోని సంతోష్‌నగర్‌లో వలసకార్మికులు అధికంగా ఉంటారు. ముఖ్యంగా వారంతా రియల్‌ఎస్టేట్‌తో పాటు ఆటో డైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లుగా పని చేస్తుంటారు. అయితే, గతేడాది లాగే ఈ సారీ ఈ ప్రాంతంలోని వలసకార్మికులు ఇంటి బాట పట్టారు. ముఖ్యంగా వీరంతా యూపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం. '' ఒకవేళ మేము ఇక్కడే ఉంటే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అప్పుడు గతేడాది లాగే రైల్వే ప్రయాణానికి కూడా ఫుల్స్టాప్ పడొచ్చు. దీంతో మేము మళ్లీ మా ఇండ్లకు కాలి నడకన వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మేము ఇండ్లకు వెళ్లి పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి రావడం శ్రేయస్కరం'' అని జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు నారాయన్ మోండల్ తెలిపారు. ప్రధాని మోడీ సందేశాన్ని తాము విన్నామనీ, రానున్న రోజుల్లో లాక్డౌన్ వచ్చే అవకాశం ఉన్నదనీ, అలాంటప్పుడు తాము ఇక్కడ ఎందుకుండాలని ప్రశ్నించారు. కాగా, మహారాష్ట్రలో గురువారం నుంచే లాక్డౌన్ నిబంధనలను కఠినంగా విధించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. పెరుగుతున్న కేసుల తీవ్రత దృష్ట్యా ఈ లాక్డౌన్ 15 రోజుల పాటు ఉండనున్నది.