Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త కేసుల్లో ప్రపంచ రికార్డు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు
- కొత్తగా 3.14 లక్షల కేసులు, 2 వేలకు పైగా మరణాలు
- బెడ్ల కోసం బేరాలు !
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మహా సునామీ సృష్టిస్తోంది. మరే దేశంలోనూ నమోదుకాని రీతిలో కొత్త కేసులు, మరణాలు భారత్‌లో నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలో ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. గతంలో అమెరికా పేరిట ఉన్న ఒకే రోజు అత్యధిక కేసుల రికార్డును సైతం చెరిపేసింది. అలాగే, దేశంలో వ్యాక్సిన్ల కొరత, ఆస్పత్రుల్లో బెడ్లకొరత, ఆక్సిజన్ కొరత పరిస్థితులను మరింత దారుణంగా మారుస్తోంది. దీనికి తోడు అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో కరోనా సృష్టిస్తున్న కల్లోలంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ టీకా హబ్‌గా ఉన్న భారత్‌లో కరోనా ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే సంభవించే సంక్షోభం దారుణంగా ఉంటుందని భయాందోళన చెందుతున్నాయి. తాజాగా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు, 2,104 మరణాలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు ఇప్పటివరకు ఏ దేశంలోనూ నమోదుకాలేదు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,59,30,965కు చేరగా, మరణాలు 1,84,841కి పెరిగాయి. ఇప్పటివరకు 1,34,54,880 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 22,91,428 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు 27,27,05,103 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 13,23,30,644 మందికి టీకాలు వేశారు.
బెడ్స్ కోసం బేరాలు.. ఆస్పత్రులకు రావొద్దంటున్న వైద్యులు !
దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలంతో ఆస్పత్రులన్ని రోగులతో కిటకిటలాడుతున్నాయి. టీకాల కొరతతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. మరీ దారుణంగా పలుచోట్ల ఒక్కొబెడ్పై ఇద్దరు ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి దాపురించింది. మధ్యప్రదేశ్‌లోని సెహౌర్ జిల్లా ఆస్పత్రిలో బెడ్లు నిండిపోవడంతో ఇక ఎవర్నీ అడ్మిట్ చేసుకోలేమంటూ ఆస్పత్రి గేట్‌కు నోటీసులు అంటించారు. గుజరాత్‌లోనూ పరిస్థితులు దారుణంగా మారాయి. దీనిపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బెడ్లకోసం బేరసారాలు జరగడ కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఓ ఏజెంట్ కోవిడ్-19 బెడ్ కోసం రోగి బంధువులతో రూ.9000 ఇస్తే అరగంటలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, కరోనా లక్షణాలున్న ఓ మాజీ బ్రిగేడియర్‌కు ఆర్మీ ఆస్పత్రితో పాటు ఢిల్లీలోని ఇతర ఆస్పత్రుల్లో బెడ్ లభించకపోవడంతో అంబులెన్స్‌లో చండీగఢ్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు కరోనా..
ఆస్పత్రిలో లిఫ్ట్‌లో ఇరుకున్న మరో జడ్జి !
సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న మరో నలుగురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు సుప్రీంలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఈ క్రమంలోనే కోర్టుకు రాలేని పక్షంలో ఇంటి నుంచి విధులు నిర్వహించాలని సుప్రీం రిజిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కొంది. యూపీలోని కాన్పూర్ జిల్లా జడ్జికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వెళ్లగా.. కింది అంతస్తు నుంచి పైకి వెళ్తున్న క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. లిఫ్ట్ నుంచి బయటపడిన ఆయన వార్డులోకి రాగానే అక్కడ వైద్యులేవ్వరు లేకపోవడం.. కరోనా రోగుల ఇబ్బందులను చూసిన ఆయన విధుల్లోలేని వైద్యులపై కేసులు నమోదుచేసి, విచారణ జరపాలని ఆదేశించారు. యూపీలోని పలు ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి గురువారం ఉదయం కన్నుమూశారు.
మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించండి: కోర్టు
మహారాష్ట్రకు నిత్యం సరఫరా చేస్తున్న ద్రవ ఆక్సిజన్‌ను 60 మెట్రిక్ టన్నులకు తగ్గించాలని ఈ నెల 18న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రానికి 110 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను సరఫరాను కొనసాగించాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తాజాగా పీఆర్ఏఎక్స్ ఏఐఆర్-భిలారుని ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరాను తగ్గించాలని కేంద్ర తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులను మరింత దారుణంగా మార్చిందని న్యాయమూర్తులు సునీల్ బి. షౌక్రె, ఎస్ఎం మోదక్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో దాదాపు 40 శాతం వెలుగుచూస్తున్న మహారాష్ట్రకు ద్రవ ఆక్సిజ్ సరఫరాను 200 నుంచి 300 మెట్రిక్ టన్నుల మధ్య ఉండాలని కోర్టు తెలిపింది.