Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణవాయువు కొరతపై సుప్రీం ఆందోళన
- కరోనా నియంత్రణ అంశాలు సుమోటాగా స్వీకరణ
- ఆక్సిజన్, మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌పై ప్రణాళిక రూపొందించాలని ఆదేశం
- కేంద్రానికి నోటీసులు ..నేడు విచారణ
న్యూఢిల్లీ : కరోనా ఉధృతి నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడటంపై దేశ అత్యున్నత నాయయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 'పరిస్థితి చేయిదాటిపోతున్నదనీ, దేశంలో నేషనల్ ఎమర్జన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి' అని వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన అంశాన్ని సుమోటోగా విచారించాలని నిర్ణయిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. నేడు (శుక్రవారం) విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. ఈ లోగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై జాతీయ స్థాయి ప్రణాళికను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 'దేశంలో ఆక్సిజన్, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ జరుగుతున్న పద్దతి, లాక్డౌన్ ప్రకటించే అధికారం' అనే అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం.' అని ధర్మాసనం తెలిపింది. పరిస్థితి చేయిదాటుతున్నా చోద్యం చూడటం సరికాదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల హైకోర్టులలో ఈ విషయమై విచారణ జరుగుతుండటంతో గందరగోళాన్ని నివారించేందుకు తామే నేరుగా విచారించాలని నిర్ణయించినట్లు ధర్మాసనం తెలిపింది. కేసు విచారణలో కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేను నియమించారు.
అడ్డంకులు పరిష్కరించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఆక్సిజన్ సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలపై వెంటనే స్పందించి, తగిన పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హర్యానాలోని పానిపట్ నుంచి రావాల్సిన అక్సిజన్ను అక్కడి స్థానిక పోలీసులు తీసుకెళ్లనివ్వడం లేదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా పలు ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు అధికారులు అడ్డుపడుతున్నారని వివరించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ సమస్య ను అత్యవసరంగా పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ఆక్సిజన్ రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్టు, ఎస్పిలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఉత్పత్తి పెంచండి .. మోడీ ఆదేశం
తక్షణం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మోడీ ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగాలన్నారు. అడ్డంకులను తొలగించడానికి స్థానిక అధికారుల సాయం తీసుకోవాలని చెప్పారు.