Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్ముకాశ్మీర్లో ఎస్టిఎఫ్పై సిపిఎం ఆగ్రహం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో ఉద్యోగులను పర్యవేక్షించడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్)ను ఏర్పాటు చేయడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఉద్యోగులను పర్యవేక్షించే చర్యలు 'ఏకపక్షం, క్రూరమైన' వని సిపిఎం నేత ఎంవై తరిగామి విమర్శించారు. ''దేశ వ్యతిరేక' కార్యకలాపాలలో దొరికినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఎటువంటి విచారణ నిర్వహించకుండా తొలగించడానికి, ఇతర శిక్షాత్మక చర్యలను తీసుకోవడానికి ఎస్టిఎఫ్ ఏర్పాటు చేయాలన్న జమ్ముకాశ్మీర్ పరిపాలనా విభాగం తాజా ఉత్తర్వు ఏకపక్షమైనది, క్రూరమైనది. ఇది ఈ ప్రాంతంలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధం' అని తరిగామి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ఉద్యోగుల్లో అసంతప్తిని, ఆగ్రహాన్ని మరింత పెంచుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే చట్టంలో తగిన నిబంధనలు ఉన్నాయని, కొత్త ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేదని చెప్పారు. 'ఉద్యోగులను అణచివేయడానికి తాజా ఉత్వర్వు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగుల తలలపై అనిశ్చితి అనే కత్తి ఉంచారు. ఇలాంటి ఉత్తర్వులు ఉన్నతాధికారులకూ హానికరంగా మారతాయి' అని అన్నారు. ఉద్యోగి మొదట పౌరుడని, ఆయనకు అన్ని రాజ్యాంగ హక్కులు ఉంటాయని చెప్పారు. ఇలాంటి హక్కులను రక్షించడం అవసరమని తరిగామి తెలిపారు.