Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27కు విచారణ వాయిదా
న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కరోనా పరిస్థితిపై సుప్రీం కోర్టు సుమోటోగా చేపడుతున్న విచారణ నుంచి ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే అమికస్ క్యూరీగా తప్పుకున్నారు. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే, న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే తనకు ఎప్పట్నుంచో తెలిసి ఉన్నందున ఈ విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే శుక్రవారం తప్పుబట్టారు. గురువారం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను చదవకుండానే ఉద్దేశాలను ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను ఓ కేసులో అమికస్ క్యూరీగా నియమించడంపైనా, గురువారం ఇచ్చిన ఆదేశాలపైనా సీనియర్ న్యాయవాదులు యథేచ్ఛగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 మేనేజ్మెంట్కు సంబంధించిన కేసులను విచారించడం నుంచి హైకోర్టులను తాము నిలువరించలేదని చెప్పారు. అమికస్ క్యూరీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అనుమతివ్వాలని హరీశ్ సాల్వే చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ స్పందనకు గడువిస్తూ తదుపరి విచారణ ఈ నెల 27కు సుప్రీం వాయిదా వేసింది. ఈ ధర్మాసనంలో సిజెఐతోపాటు జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ ఎస్ఆర్ భట్ కూడా ఉన్నారు.