Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది మృతి
- 60 మంది పరిస్థితి విషమం
న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు కోవిడ్ బాధితులను బలిగొంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో గత 24 గంటల్లో కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న 25 మంది మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 'ఆస్పత్రిలో మరో రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉన్నాయి. సుమారు 60 మంది రోగులు పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ అత్యవసరం' అంటూ ఆస్పత్రి వర్గాలు ట్వీట్ చేశాయి. ఒకేరోజు 25 మంది మరణించడం ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం అని యాజమాన్యం వెల్లడించింది. సర్ గంగారామ్ ఆస్పత్రి యాజమాన్యం ఎస్ఒఎస్ పంపిన రెండు గంటల వ్యవధిలో ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఈ ఆస్పత్రి ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన ప్రైవేటు ఆస్పత్రి. ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 142 మందికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉంది. మరోవైపు మ్యాక్స్ ఆస్పత్రి ఆక్సిజన్ కొరత వల్ల తాము కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవడం లేదని ప్రకటించింది. ఆక్సిజన్ సరఫరాను స్థిరీకరించే వరకు ఢిల్లీలోని తమ ఆస్పత్రుల్లో కొత్తగా కరోనా రోగులను చేర్చుకోవడం లేదని, ఈ విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నానని మ్యాక్స్ ఆస్పత్రి ట్విట్టర్లో వెల్లడించింది. అత్యవసరంగా కొద్ది మొత్తంలో ఆక్సిజన్ అందిందని, అది రెండు గంటలకే సరిపోతుందని పేర్కొంది. ఎవరినీ చేర్చుకోబోమన్న ప్రకటనను ఆ తరువాత ఆసుపత్రి వెనక్కు తీసుకుంది.