Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దహన సంస్కారాలకు దొరకని స్థలం
- ఢిల్లీలో 'కరోనా' దారుణ పరిస్థితులు
- సామూహికంగా మృతదేహాల దహనం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మృత్యుకేళి సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి మరణిస్తున్న బాధితుల మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేందుకు శ్మశాన వాటికల్లో స్థలం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. నగరానికి చెందిన నితీష్‌కుమార్ తల్లి కరోనాతో చనిపోగా, ఆమె దహన సంస్కారాలకు నగరంలోని శ్మశాన వాటికల్లో స్థలం కోసం వెతుకుతూ మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంటిలోనే ఉంచుకోవడం ప్రస్తుత దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈశాన్య ఢిల్లీ, సీమాపూరిలోని శ్మశానవాటికకు అనుకొని ఉన్న పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో నితీష్‌కుమార్ గురువారం తన తల్లి దహన సంస్కారాలను పూర్తి చేశారు. చెమర్చిన కళ్లతో నితీష్‌కుమార్ మాట్లాడుతూ.. 'నా తల్లి దహన సంస్కారాలకు ప్రతి శ్మశాన వాటికకు వెళ్లారు. ప్రతిచోటా ఏదొక కారణం చెబుతున్నారు. ఒక చోట అయితే కలప కూడా అయిపోయిందని చెప్పారు.' అని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న తన తల్లికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అధికారులు ఆమెకు ఆసుపత్రిలో ఒక బెడ్‌ను చూపించలేకపోయారని పేర్కొన్నారు. ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా 3.14 లక్షల పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, ఢిల్లీలో 26 వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 306 మంది మరణించారు. ఇంత పెద్దమొత్తంలో మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో శ్మశాన వాటికల్లో ఖాళీలేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సదుపాయాల్లో సామూహిక దహన సంస్కారాలు పూర్తి చేసేస్తున్నారు. 'ది షాహీద్ భగత్‌సింగ్ సేవాదళ్' అనే నాన్ ఫ్రాఫిట్ మెడికల్ సర్వీసును నడుపుతున్న జితేందర్ సింగ్ మాట్లాడుతూ పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సదుపాయంలో గురువారం మధ్యాహ్నానికి 60 మృతదేహాలను దహనం చేశామని, ఇంకా 15 వరకు ఉన్నాయని చెప్పారు. కరోనా మొదటి దశ సమయంతో పోల్చుకుంటే ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, ఒక్క మంగళవారం రోజున ఒకే ప్రదేశంలో 78 మృతదేహాలను దహనం చేసినట్లు తెలిపారు.