Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజవర్గ అభివృద్ధిపై మమత శీతకన్ను
- సిపిఎం, టిఎంసి, బిజెపి మధ్య త్రిముఖ పోరు
జమురియా : పశ్చిమబెంగాల్లో గురువారం నాటి పోలింగ్‌తో ఇప్పటికి ఆరు దశల ఎన్నికల పూర్తయ్యాయి. మరో రెండు దశలు మిగిలివున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 26న ఏడో దశ జరగనుంది. ఈ దశలోనే ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర కోల్(బొగ్గు) బెల్ట్‌గా ఉన్న పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని జమురియా నియోజకవర్గం ఉంది. ఈ స్థానం సిపిఎంకు కంచుకోటగా ఉంది. ఇక్కడ దాదాపు గత తొమ్మిది పర్యాయాలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సిపిఎం తరపున జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు, 25 ఏళ్ల ఐషే ఘోష్ బరిలో ఉన్నారు. అధికార టిఎంసి తరపున కోల్ మైనర్, టిఎంసికి చెందిన కార్మిక సంఘం ఐఎన్‌టిటియుసి అనుబంధ బొగ్గు గని కార్మికుల అసోసియేషన్ నేతగా ఉన్న హరేంరాం సింగ్, బిజెపి నుంచి తపాస్ రారు పోటీచేస్తున్నారు.
జమురియా స్థానంలో గత రెండు సార్లు గెలుపొంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జహనరా ఖాన్ స్థానంలో సిపిఎం ఈసారి ఐషే ఘోష్‌ను రంగంలోకి దించింది. జెఎన్‌యులో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న ఘోష్.. కేంద్రం తీసుకొచ్చిన సిఎఎ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వర్సిటీలో జరుగుతున్న ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ప్రముఖంగా ఉన్నారు. కేంద్రం మతోన్మాద విధానాలపై ఆమె నిర్భయంగా గొంతెత్తారు. బొగ్గు గని కార్మికులు అధికంగా ఉండే జమురియా స్థానంలో నెగ్గేందుకు టిఎంసి కార్మిక సంఘానికి చెందిన నేతనే పోటీలో పెట్టింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అసన్సోల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ జమురియాలో బిజెపికి అధిక ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది.
జమురియాలో 2.22 లక్షల ఓటర్లు ఉండగా, వారిలో 27 శాతం మైనార్టీలు, 25 శాతం ఎస్సి, ఎస్టిలు ఉన్నారు. ఈ ప్రాంతం గత పదేళ్ల టిఎంసి పాలనలో నిర్లక్ష్యం పాలైందని, ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి మనోజ్ దుత్తా విమర్శించారు. లెఫ్ట్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించబడిన ఒక స్టీల్ ఫ్యాక్టరీతో సహా రెండు పరిశ్రమలను తరువాత వచ్చిన మమత సర్కార్ పక్కనపెట్టిందని దుయ్యబట్టారు. జమురియా స్థానాన్ని సిపిఎం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని, ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఐషే ఘోష్ తన వాణిని అసెంబ్లీలో వినిపిస్తారని అన్నారు. టిఎంసి, బిజెపి అభ్యర్థులు కూడా తామే విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.