Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ ఉధృతి పట్టని కేంద్రం - ఏడాది ముందుగా కుంభమేళా
న్యూఢిల్లీ : ప్రజారోగ్యం కంటే మత ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించిన పరిస్థితి హరిద్వార్‌లో కుంభమేళాను చూస్తే అర్థమవుతోంది. కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా ఉన్నా పట్టించుకోకుండా ఏడాది ముందుగా కుంభమేళా నిర్వహించడంపై అనేక విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కుంభ మేళాకు లక్షలాదిమంది హాజరవగా, వేలాదిమందిలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహించాల్సి ఉంది. హరిద్వార్ కుంభమేళా చివరిసారిగా 2010లో జరిగింది. దీని ప్రకారం హరిద్వార్‌లో 2022లో జరపాలి. 'సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం', 'బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించడం' వంటి కారణాలతో 'జ్యోతిష్యశాస్త్ర సర్దుబాట్లు' ప్రకారం హరిద్వార్ కుంభమేళాను 2021లోనే నిర్వహించాలని జ్యోతిష్యులు ప్రకటించారు. కరోనా విపత్తు సమయంలో కుంభమేళాను రద్దు చేయడానికి లేదా నామమాత్రంగా జరపడానికి బదులుగా ఘనంగా నిర్వహించడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు కరోనా సూపర్ స్పైడర్ ఈవెంట్లుగా ఎలా మారతాయో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలిసి కూడా ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరం. గత ఏడాది ఢిల్లీలో రెండు వేల మంది హాజరైన జమాతే కార్యక్రమం సూపర్ స్ప్రైడర్గా మారిందని ప్రచారం చేసిన కాషాయ పెద్దలే లక్షలాదిమంది హాజరైన కుంభమేళాకు అనుమతించడం గమనార్హం.
త్రివేంద్రసింగ్ను కుంభమేళా కోసమే తప్పించారా?
ఈ కుంభమేళాను ఘనంగా నిర్వహించడానికే ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్‌ను బిజెపి తప్పించిందన్న ప్రచారం కూడా ఉంది. కుంభమేళా యథావిధిగా జరుగుతుందని త్రివేంద్ర సింగ్ చెప్పినా, కార్యక్రమంపై ఆంక్షలు విధిస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. 2020 డిసెంబరులో అఖడ పరిషత్ సాధువులు కుంభమేళా ఏర్పాట్లపై పెదవి విరిచారు. ఈ ఏడాది మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వెంటనే పదవిలోకి వచ్చిన త్రిరాత్ సింగ్ రావత్ కుంభమేళాపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించారు. భారీ ఏర్పాట్లు చేశారు. అపరిమితంగా ప్రజలను ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ప్రచారం చేసింది. కేంద్ర పర్యాటక, రైళ్ల శాఖలు భారీ ఏర్పాట్లు, ప్రచారం చేశాయి. గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం రైళ్లు నడపకుండా మీనమేషాలు లెక్కించిన రైళ్ల శాఖ కుంభమేళాకు మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి డెహ్రడూన్, రిషికేశ్‌లకు అధిక సంఖ్యలో ప్రత్యేక ట్రైన్లను నడుపుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికలు, టివీలు, రేడియోల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చాయి. కరోనా కేసులు, మరణాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని నాయకులు పట్టించుకోవడం లేదు. మరణం అనివార్యమని, సాంప్రదాయాలు కొనసాగడమే ప్రధానమని చెబుతున్నారు. బిజెపి నేతలకు ప్రజారోగ్యం, సంక్షేమం కన్నా తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలకు తెలుసునని విశ్లేషకులు పేర్కొంటున్నారు.