Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ విధానాలకు తోడు వైరస్ సంక్షోభంతో చిరు వ్యాపారులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. దాదాపు 82 శాతం చిరు వ్యాపారాలు కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని డూన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) ఓ సర్వేలో తెలిపింది. తయారీ రంగం సంక్షోభానికి గురైందని వెల్లడించింది. రూ.100-250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన 250కిపైగా సంస్థల అభిప్రాయాలు, వాటి ప్రస్తుత ప్రగతి ఆధారంగా ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రిటైల్ రుణాలకూ కరోనా సెగ తగులుతున్నది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా వసూళ్లకు ఆటంకాలు ఏర్పడటంతో ఈ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం అంటే మూడింట రెండొంతుల కంపెనీలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు కరోనాకు ముందు ఉన్న డిమాండ్‌ను అందుకోవాలంటే ఇంకో ఏడాది కాలం పడుతుందన్నారు. మార్కెట్ అవకాశాలు పడిపోవచ్చని 42 శాతం సంస్థలు, స్థూల ఉత్పత్తి పతనం అవుతుందని 37 శాతం, నగదు లభ్యత సమస్యగా మారుతుందని 34 శాతం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మెరుగైన రుణ పరపతి వసతి కల్పించాలని మెజారిటీ సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. దేశంలోని చిన్న వ్యాపారాల రికవరీపైనే భారత వాణిజ్య సంస్థల రికవరీ ఆధారపడి ఉంటుందని డాన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ గ్లోబల్ చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ పేర్కొన్నారు.
భారత్‌కు ఫిచ్ ప్రతికూల రేటింగ్
కరోనా కేసుల పెరుగుదలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రికవరీలో జాప్యం జరగవచ్చని ఫిఛ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుత ప్రస్తుతలను దృష్టిలో ఉంచుకొని భారత్‌కు ప్రతికూల సార్వభౌమ రేటింగ్ బీబీబీ-) ఇస్తున్నామని ఫిచ్ రేటింగ్స్ స్పష్టం చేసింది. అయితే ఈ రేటింగ్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పదని పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత్ 12.8 శాతం వృద్థిని సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది.