Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగనున్నట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, క్యాబినెట్ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు సమాచారం. కాగా, సీజేఐగా బాబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో వర్చువల్గా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో రమణ మాట్లాడుతూ 'వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని' అని అన్నారు.
సంతృప్తితో వెళుతున్నా.. : బాబ్డే
తనకు సాధ్యమైనంత వరకూ మంచి చేశానన్న సంతృప్తితో వెళుతున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) శరద్ అరవింద్ బాబ్డే తెలిపారు. 21 ఏండ్ల పాటు జడ్జీగా పని చేశానని, అయితే సుప్రీంకోర్టుకు జడ్జీగా పనిచేయడం ఎంతో గొప్ప అనుభవమని చెప్పారు. జస్టిస్ బాబ్డే తన పదవీకాలంలో అయోధ్య కేసు వంటి ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. ఆయన హయాంలోనే కరోనా కారణంగా సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారణ, తీర్పు వంటి కార్యక్రమాలు నిర్వహించింది. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మాట్లాడుతూ సీ జేఐ పదవీకాలం కనీసం మూడు సంవత్సరాలు ఉండాలని సూచించారు. సొలిసి టర్ జనరల్ తుషార్ మెహతా మట్లాడుతూ బాబ్డే తెలివైన జడ్జీ మాత్రమే కాదని, మంచి హాస్య చతురత కూడా ఉన్నవాడని చెప్పారు. సుప్రీంకోర్టు బార్ అసోసి యేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచడానికి రాజ్యంగ సవరణ తీసుకురావాలని అన్నారు.