Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానిని కోరిన ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈసమావేశంలో వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరత ప్రధానంగా చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధరకు వ్యాక్సిన్ అమ్మడానికి కంపెనీలకు అనుమతి ఇవ్వడం పట్ల పలువురు ముఖ్యమంత్రులు అభ్యంతరాన్ని తెలియచేసినట్టు సమాచారం. ఇది రాష్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుందని చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేయాల ని కోరారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన 400రూపాయల ధరను పరిగణలోకి తీసుకుంటే ఒక్క కేరళపైనే 1300కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని చెప్పారు. తమ రాష్ట్రానికి తక్షణం 50లక్షల డోసులవ్యాక్సిన్ను సరఫరా చేయాలని కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ను ఉచితంగా కేంద్రమే సరఫరా చేయాలని, లేని పక్షంలో కేంద్రానికి ఇస్తున్న ధరకే రాష్ట్రానికీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేకుండా చూడాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేలా కోరారు. ప్రధాని మాట్లాడుతూ కరోనాపై జరుగుతున్న పోరాటంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో, ముఖ్యమంత్రులు, ఉద్ధవ్ థాకరే, అశోక్ గెహ్లాట్, బిఎస్ యడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్, విజరు రూపానీ, యోగి ఆదిత్యనాథ్, అమరీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.