Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో రెండువేలకు పైగా మరణాలు
- మహారాష్ట్ర ఆస్పత్రి ఐసీయూలో మంటలు.. 14 మంది కరోనా రోగులు మృతి
- ఢిల్లీ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది బలి
- దేశవ్యాప్తంగా ఒక్క రోజే 3.32 లక్షలకు పైగా కరోనా బాధితులు..
- ఇప్పటివరకు మొత్తం మృతులు 1.86 లక్షలు.. కేసులు 1.62 కోట్లు
- ప్రపంచవ్యాప్తంగా వరుసగా రెండో రోజూ భారత్‌లోనే అత్యధిక కేసులు
న్యూఢిల్లీ, ముంబయి : భారత్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు రెండు వేలకు పైగా మరణాలు నమోదయ్యి ప్రజలను తీవ్రంగా హడలెత్తిస్తున్నది. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్, సిబ్బంది, రెమ్‌డెసివిర్ డ్రగ్ కొరతతో పాటు మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రస్తుత తీవ్ర పరిస్థితికి కారణమవుతున్నది. అంతేకాకుండా, మోడీ సర్కారు నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలి, రాష్ట్రాలకు సరైన కాలంలో ఆక్సిజన్ సరఫరాను చేయకపోవడం, వ్యాక్సిన్ కొరత విషయంలో ముందు చూపు లోపించడం దేశంలో పరిస్థితి మరింత జఠిళం కావడానికి కారణమవుతున్నదని ఆరోగ్య నిపుణులు ఆరోపించారు. దేశంలో కరోనా కేసులూ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం నాటికి) 2,257 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,86,920కు చేరుకున్నది. అలాగే 3.32 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన ఈ కొత్త కేసులతో వరుసగా రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ నిలిచింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695కు చేరుకున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 24.22 లక్షలుగా ఉన్నది. దీంతో క్రియాశీల రేటు 14.38 శాతానికి పెరిగింది. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు ఇటు ప్రజలను.. అటు ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక రికవరీ రేటు 84.46 శాతానికి పడిపోవడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13.23 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ను ఇచ్చారు.
మహారాష్ట్రలో మరో ప్రమాదం..
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకున్నది. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని ఒక ఆస్పత్రిలో గల ఐసీయూలో మంటలు చెలరేగి 14 మంది రోగులు మృతి చెందారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విజరు వల్లభ్ ఆస్పత్రిలో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరి గింది. రెండో అంతస్థుల గల ఐసీయూలో మంటలు చెలరే గాయి. దీంతో రోగుల బంధువులు, మిత్రులు భయాందో ళనకు గురయ్యారు. బయటకు ఉరుకులు, పరుగులు తీశారు. ఘటన జరిగిన సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో.. 14 మంది రోగులు అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో 10 మంది మహిళలున్నారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. ఘటనా ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో ఇతర రోగులను వెంటనే మరొక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఏసీలో షార్ట్ సర్క్యూట్ కార ణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తున్నది. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు కేంద్ర మంత్రులు విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర సీఎం దర్యాప్తునకు ఆదేశిం చారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 90 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారని ఆస్పత్రి సీఈఓ దిలీప్ షా తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 1 లక్ష చొప్పున ప్రకటించింది. ఇటు మోడీ కూడా మృతుల కుటుంబాలకు 2లక్షల చొప్పున ప్రకటించారు. రాష్ట్రంలోని నాసిక్‌లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై.. ప్రాణవాయువు అందకపోవడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే ఈఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఒకవైపు నానాటికి ఉగ్రరూపం దాల్చుతున్న కరోన కేసులు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ఇలాంటి ప్రమాదాలు సంభవించడం ఆందోళనకరంగా మారింది.
24 గంటలు.. 25 మంది మృతి
దేశంలో అడుగంటుతున్న ఆక్సిజన్ నిల్వలు కరోనా రోగుల పాలిట శాపంగా మారాయి. ఆక్సిజన్ అందకపోవడం కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోగులు మృతి చెందిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు దేశరాజధానిలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో గడిచిన 24 గంటల్లో 25 మంది రోగులు చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశరాజధానిలోని మిగతా ఆస్పత్రుల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉన్నదనే విషయం ఈ ఘటనతో వెల్లడైంది. కాగా, ఆస్పత్రిలో రెండు గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ ఉన్నదనీ, 60 మందికి పైగా రోగుల పరిస్థితి ప్రమాదంలో ఉన్నదని సదరు ఆస్పత్రి తెలిపింది. అలాగే, వెంటిలేటర్లు సరిగ్గాపనిచేయడం లేదనీ, ఈ మేరకు అత్యవసర జోక్యం అవసరమని గంగా రామ్ డైరెక్టర్ వివరించారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ను తక్షణమే ఏయిర్లిఫ్ట్ చేయాలని సూచించింది. 'తక్కువ ఆక్సిజన్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయి. ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్న రోగులకు ఆక్సిజన్ సరఫరా తప్పనిసరి'' అని మెడికల్ డైరెక్టర్ సతేంద్ర కటోచ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఆస్పత్రి యాజమాన్యం ప్రకటన అనంతరం గంగారామ్ ఆస్పత్రికి ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన గంగారామ్ ఆస్పత్రిలో 500 మందికి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఒక్క గంగారామ్ ఆస్పత్రిలోనే కాదు.. రాష్ట్రంలోని మిగతా ఆస్పతుల్లో సైతం ఆక్సిజన్ సరఫరా, మందులు, బెడ్ల సమస్యలున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అన్ని ఆస్పత్రులూ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఢిల్లీకి మెడికల్ ఆక్సిజన్‌ను కల్పించాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.