Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : తమ రాష్ట్రంలోని 18 నుంచి 45 ఏండ్లలోపువారికి సైతం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించిన నేపథ్యంలో కేరళీయులు తమ ఉదారతను చాటుకుంటున్నారు. చీఫ్ మినిస్టర్స్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్)కు ఆ రాష్ట్ర ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో వేలాది మంది కేరళీయులు సాయం చేస్తున్నారు. ఈ విరాళాల ఉద్యమం బుధవారం రాత్రి ప్రారంభమైంది. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా దీనిని ప్రారంభించారు. తాము వ్యాక్సిన్ వేయించుకున్నామనీ, తాము సీఎండీఆర్ఎఫ్కు విరాళాలు ఇస్తామని ప్రకటించారు. దీనిని ఆదర్శంగా తీసుకుని వేలాది మంది స్పందిస్తూ, విరాళాలు ఇస్తున్నారు. కొందరు తమ విరాళాల సర్టిఫికేట్లను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 1.65 కోట్లు సాయంగా అందిస్తున్నట్టు తెలుస్తున్నది.