Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు మద్దతు తెలిపిన వందలాదిమంది ఉపాధ్యాయులు
న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 148 రోజుకు చేరుకుంది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహన్‌పూర్ సరిహద్దుల్లో ఆందోళన శనివారం కూడా కొనసాగింది. రైతులకు మద్దతుగా వేలాదిమంది ప్రజలు ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతున్నారు. శనివారం పంజాబ్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం తరపున వందలాదిమంది ఉపాధ్యా యులు టిక్రీ సరిహద్దుకు చేరుకున్నారు. దీంతో రైతుల్లో నూతనోత్సాహం కనిపించింది. శని వారం సింఘూ సరిహద్దు వద్ద సాహిబ్ సింగ్ దర్శకత్వం వహించిన నాటకాలు రైతుల పోరాటంలో కళ ప్రాముఖ్యతను వివరించాయి. అదే సమయంలో పంజాబీ కళాకారుడు రవీం దర్ గ్రెవాల్ కూడా ప్రదర్శన ఇచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) కొన్ని సామాజిక సంఘాలు, వైద్యుల సహాయంతో కరోనా చర్యలు చేపట్టింది. పారిశుధ్యం, మాస్కులు పంపిణీ, టీకాలు వంటి చర్యలను చేపట్టింది. టిక్రీ సరిహద్దు వద్ద డాక్టర్ సవాయిమాన్ సింగ్ ఆధ్వర్యాన వైద్య బృందం కరోనాకు సంబంధించిన జాగ్రత్తలను వివరించింది.
ఎస్‌కెఎం సంతాపం
ఎస్‌కెఎం నేతలు దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చాధుని, హన్నన్ మొల్లా, యోగేంద్ర యాదవ్, జగ్జీత్ సింగ్ దల్లెవాల్, బల్బీర్ సింగ్ రాజేవాల్, యుధ్వీర్ సింగ్, అభిమన్యు కోహాద్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌తో సహా పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించిన వారికి ఎస్‌కెఎం సంతాపం తెలియజేసింది. దేశ ప్రయోజనాలను, మానవ ప్రయోజనాలను ఆలోచిస్తూ, రైతులు ఇప్పటికే అత్యవసర సేవల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఒక వైపు రహదారులను తెరిచారని వివరించారు. రెండు రోజుల క్రితం హర్యానా ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించిన విధంగా రహదారికి ఒక వైపు నుంచి బారికేడ్లను తొలగించామని, కానీ ఢిల్లీ పోలీసులు ఇంకా బారికేడ్లను తొలగించలేదని పేర్కొన్నారు.