Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా తీవ్రస్థాయి విజృంభణతో భారత్‌లో ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి ఆసుపత్రులకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్‌కు 24 క్రయోజనిక్ ట్యాంకులను తరలించనున్నట్లు నిత్యావసర వస్తువుల(కంజ్యూమర్ గూడ్స్) ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటిసి లిమిటెడ్ శనివారం వెల్లడించింది. పొరుగున ఉన్న ఇతర ఆసియా దేశాల నుంచి ఈ ఐఎస్ఒ సర్టిఫై చేసిన ట్యాంకులు త్వరలో వాయుమార్గంలో బయలు దేరనున్నాయని, ఇందుకు జర్మనీకి చెందిన మెడికల్ ఆక్సిజన్ సరఫరా కంపెనీ 'లిండే' సహకారం అందిస్తుందని తెలిపింది. 'దేశ ప్రాధాన్యత దృష్ట్యా, ఆసుపత్రులకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఐటిసి కంపెనీ తన ట్వీట్లో పేర్కొంది. పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ కాన్సెన్టేటర్స్లను తెలంగాణ, భద్రాచలంలోని తమ పేపర్ తయారీ ప్లాంట్ నుంచి రవాణా చేస్తోందని, అదేవిధంగా అక్కడి సమీప ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరాను ప్రారంభించిందని తెలిపింది. 24 ఆక్సిజన్ సరఫరా ట్యాంకులకు సంబంధించి ఇటీవల టాటా గ్రూప్ కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. దీన్ని మన దేశంలోని జర్మనీ దౌత్య కార్యాలయం కూడా ధ్రువీకరించింది. టాటా గ్రూపుతో కలిసి లిండే కంపెనీ ట్యాంకులను భారత్‌కు పంపిస్తోందని శుక్రవారం ఒక ట్వీట్లో పేర్కొంది. ఆక్సిజన సరఫరా ఆపరేషన్‌కు సాయపడేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే వైమానిక దళానికి చెందిన విమానాలను కేటాయించిన విషయం తెలిసిందే.