Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో రికవరీలో స్తబ్దత
- ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా విజృంభించడంతో దేశీయ వాహన పరిశ్రమ మళ్లీ రివర్స్‌గేర్‌లో పడింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల వల్ల అతి కొద్ది రోజుల్లోనే వాహన పరిశ్రమ డిమాండ్ క్షీణించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత కాలం పట్టొచ్చని విశ్లేషించింది. ఇండ్-రా రిపోర్ట్ ప్రకారం.. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడం ద్వారా 2021-22 ద్వితీయార్థంలో డిమాండ్ మెరుగుపడొచ్చు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలను బట్టి మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరుగొచ్చు.
ఏడాదికేడాదితో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ వాహన పరిశ్రమ విక్రయాలు ఏకంగా 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం చొప్పున పతనమయ్యాయి. ఎగుమతులు 13 శాతం క్షీణించాయి. 2021 మార్చి గణాంకాలను పరిశీలిస్తే ప్యాసింజర్ వెహికల్స్ విభాగం మినహా రిటైల్ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించాయని.. దీన్నిబట్టి వినియోగదారుల విశ్వాసం ఇంకా పూర్తిగా మెరుగు పడినట్టు కనిపించడం లేదని ఇండ్-రా తన నివేదికలో తెలిపింది.