Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వత్రిక ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రానికి సీఐటీయూ డిమాండ్
- నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలి
న్యూఢిల్లీ : నిర్ణీత సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని సీఐటీయూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్ పాలసీ రాష్ట్రాల పట్ల వివక్షాపూరితంగా ఉందని, కార్పొరేట్ లాభాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే విధంగా ఉందని విమర్శించింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సిన్, ఆక్సిజన్, మెడికల్ పరికరాల లాభదాయకతపై కఠినమైన నిషేధం విధించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ప్రజారోగ్య వ్యవస్థను విస్తరించి, బలోపేతం చేయకుండా, వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచకుండా మీడియాలో బాకాలు కొట్టుకుంటూ గత సంవత్సర కాలాన్ని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించింది. ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొంది. దేశంలోని 130 కోట్ల మందికి పైగా ప్రజలకు యుద్ధప్రాతిపదికన సార్వత్రిక ఉచిత టీకా అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. కేంద్రం అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు లొంగిపోయిందని, ధరలపై నియంత్రణ లేని విధంగా కొత్త వ్యాక్సిన్ విధానం అమ్మకాలను సరళీకృతం చేసేలా ఉందని పేర్కొంది. ఒక డోసుకు రూ.వెయ్యి ఉండడం సమర్థనీయమని, ఒక వ్యాక్సిన్ కంపెనీ అధిపతి పేర్కొన్నాడని, యూరోపియన్ యూనియన్‌లో కోవిషీల్డ్ డోసు ధర రూ.160, అమెరికాలో రూ.300గా ఉందని తెలిపింది. మన దేశంలో ప్రభుత్వం ప్రయివేటు లాభాల కోసం ప్రజల నెత్తిన నిత్యం భారాలు మోపుతోందని పేర్కొంది.
పీఎం కేర్స్ ఫండ్‌ను వినియోగించి వంద శాతం వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మోడీ ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిరసనలు తెలపాలని సీఐటీయూ కార్మికలోకంతో పాటు తన అనుబంధ సంఘాలు, కమిటీలకు పిలుపునిచ్చింది.