Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా తాండవిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరతతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. తాజాగా ఢిల్లీలో శుక్రవారం ఒక్కరోజే 24,331 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 338కి చేరింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 92 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అయితే గురువారం రోజు 28,395 కేసులు నమోదవ్వగా 306 మంది మరణించారు. బుధవారం 249 మరణాలు, మంగళవారం 277, సోమవారం 240, ఆదివారం 161, శనివారం 167 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత మాత్రమే కాదు.. ఐసీయూ పడకల లేమి కూడా వెంటాడుతోంది. ఇక కోవిడ్ రోగుల కుటుంబ సభ్యులు, స్నేహితులు పేషెంట్లకు ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చూడాలని.. సోషల్మీడియాలో అత్యవసర సందేశాలు (ఎస్ఒఎస్) పంపుతున్నారు. కోవిడ్ గుప్పిట్లో చిక్కుకున్న 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్ కొరత అంశంపై ప్రధానితో మాట్లాడారు. ఇందులో తమ రాష్ట్రానికి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లను కొన్ని రాష్ట్రాలు ఆపుతున్నాయని అన్నారు. దేశ రాజధానిలో పరిస్థితి అర్థం చేసుకోకుండా... మిగతా రాష్ట్రాలు అలా ఆపుతుంటే.. నేను ఎవరిని సంప్రదించాలో కూడా తనకు సలహా ఇవ్వమని ఆయన ప్రధానిని అడిగారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన తర్వాత ప్రధాని దీనిపై స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లను ఆపకుండా.. లేదా ఆలస్యం చేయకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరారు. అలాగే వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ తీసుకెళ్లేందుకు ఉన్నతస్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఒక్క శుక్రవారమే 25 మంది మరణించారు. ఈ ఘటన మరువక ముందే.. మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో 200 మందికి పైగా ప్రాణాలకు ప్రమాదం ఉందని.. ప్రస్తుతం అరగంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలున్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. బాట్రా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడినట్టు డాక్టర్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 350 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. ఒక ట్యాంకర్ ఆక్సిజన్ కేవలం గంటన్నర వరకు మాత్రమే సరిపోతుందన్నారు. ప్రతిరోజూ తమ ఆస్పత్ర్రికి 8 వేల లీటర్ల ఆక్సిజన్ అవుతుంది. కానీ.. ఢిల్లీ ప్రభుత్వం పంపింది మాత్రం కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే గుప్తా పేర్కొన్నారు. దీంతో రోగులు ప్రాణాపాయ స్థితిలోకి నెట్టబడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డుల్లో గంటపాటు అడ్మిషన్లు నిలిపివేత
దేశరాజధాని ఢిల్లీని కరోనా నాలుగో దశ వణికిస్తున్నది. కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్న ప్రముఖ వ్యక్తులు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి క్యూకడుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో కరోనా రోగుల సంఖ్యతోపాటు ఆక్సిజన్ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ పైప్లైన్లను ఆ మేరకు ఏర్పాటు చేసేందుకు శనివారం ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డుల్లో గంటపాటు అడ్మిషన్లు నిలిపివేశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుల్లో వంద మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.