Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ తయారీలో వ్యూహంలేక చతికిలపడ్డ భారత్
- డిమాండ్ తగ్గ ఉత్పత్తి లేదని పాలకులకూ తెలుసు : వైద్య నిపుణులు
- విమర్శలు వెల్లువెత్తటంతో కేంద్రంలో చలనం
న్యూఢిల్లీ : ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 92.86కోట్లమంది (ఏప్రిల్ 20, 2021) కోవిడ్ వ్యాక్సిన్ పొందారు. అమెరికాలో 21.33కోట్లమంది, చైనాలో 19.5కోట్లమంది, భారత్‌లో 12.7కోట్లమంది వ్యాక్సిన్‌ను పొందారు. అమెరికా దేశ జనాభాలో 40శాతంమందికి వ్యాక్సిన్ అందగా, భారత్‌లో 8శాతంమంది పౌరులు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్‌ను పొందారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో అనేకమంది వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. మనదేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్...ఉత్పత్తి ఏమాత్రమూ సరిపోదని, పాలకులకు దీనిపై అవగాహన ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ తయారీ ఆర్డర్లు ఇవ్వకుండా ఎలా?
మనదేశంలో రెండు సంస్థలు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) , భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. భారత్ బయోటెక్ దేశీయంగా తయారుచేసిన 'కోవాక్సిన్', సీరం సంస్థ (ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా తయారు) కోవిషీల్డ్..ప్రధానంగా నేడు పంపిణీ అవుతున్నాయి. వైరస్ డబుల్ మ్యూటెంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని కోవాక్సిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే సమస్యంతా ఎక్కడవచ్చిందంటే, ఈ రెండు సంస్థల ఉత్పత్తి సామర్థ్యం భారత్ అవసరాలను తీర్చలేదని వైద్య నిపుణులు అంటున్నారు.
అంతేగాక..ఈ ఔషధ తయారీ కంపెనీలకు భారత ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు వెళ్లలేదని విమర్శలున్నాయి. గ్రాంట్ల రూపంలో నిధులు అందజేయటంగానీ, వ్యాక్సిన్ తయారీకి ముందస్తు ఆర్డర్లు ఇవ్వటంగానీ మోడీ సర్కార్ చేయలేదట. రెండో వేవ్ విజృంభించాక, వ్యాక్సిన్ నిల్వలు అయిపోయ్యాక..కూడా కేంద్రంలో చలనం రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి మార్చి 17న మోడీ సర్కార్ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
ముందస్తు వ్యూహం తప్పనిసరి
కరోనా వ్యాక్సిన్ ఎలా తయారుచేయాలి? ఔషధం తయారీలో కీలక సూత్రమేంటి? అన్నదాంట్లో రహస్యమేమీ లేదు. వ్యాక్సిన్ తయారీ..మనదేశంలోని ప్రపంచప్రఖ్యాతి పొందిన ఔషధ కంపెనీలన్నింటికీ తెలుసు. అలాంటప్పుడు ఈ కంపెనీలన్నీ వ్యాక్సిన్‌ను ఎందుకు తయారు చేయలేకపోతున్నాయి? ఎందుకంటే..వ్యాక్సిన్ తయారీ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం కొన్ని కంపెనీలకు మాత్రమే ఉంది.
ఇంకొక ముఖ్యమైన అంశం, ముందస్తు ఆర్డర్లు ఇవ్వకపోతే..తయారుచేసిన వ్యాక్సిన్లు వృధా అయిపోయి ఔషధ కంపెనీలకు నష్టాలు వస్తాయి. కాబట్టే వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి ముందస్తు ఆర్డర్లు ఉంటేనే వ్యాక్సిన్లను కంపెనీలు తయారుచేస్తాయి. సామాన్యమైన ఈ విషయాన్ని గ్రహించలేక మోడీ సర్కార్, దేశాన్ని ఒక పెద్ద విపత్తు ముందు నిలబెట్టింది. మెట్రో నగరాలు, పట్టణాల్లో వ్యాక్సిన్ దొరకక..కోట్లాది మంది జనం వైరస్ ప్రమాదాన్ని ఎదుర్కొవాల్సి వస్తోంది.
మన సామర్థ్యం ఎంత?
'కోవాక్స్ మైత్రి'లో భాగంగా ఇతర దేశాలకు భారత్ పంపిన వ్యాక్సిన్ డోసులు 6.6కోట్లు. ఇవి 94 దేశాలకు వెళ్లాయి. ఇందులో కోటీ 6 లక్షల డోసులు మాత్రమే గ్రాంట్ కింద భారత్ సేకరించింది. మిగతావన్నీ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వద్ద కొనుగోలు చేసి ఎగుమతి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 92.9 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారుకాగా, ఇందులో భారత్ దేశంలో తయారైనవి (21శాతం) 19.3కోట్ల డోసులు. వాస్తవ గణాంకాలు ఈవిధంగా ఉంటే, ప్రపంచంలో 60శాతం వ్యాక్సిన్ తయారీ భారత్‌లోనే తయారవుతోందని, ఎన్నో పేద దేశాలకు వ్యాక్సిన్ పంపుతున్నామని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది.
మీడియా మేనేజ్మెంట్ !
'యునిసెఫ్'కు సరఫరా అవుతున్న (డీటీపీ, ఎంఎంఆర్, పోలియో..మొదలైనవి) వ్యాక్సిన్లలో 60శాతం భారత్ నుంచే వెళ్తున్నాయని ప్రధాన మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. ఇదంతా కూడా కోట్లాదామంది ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చడానికి వండివార్చిన వార్తా కథనాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనాపై వ్యాక్సిన్ తయారవటం, ఇతర దేశాలకు ఎగుమతి చేయటం మొదలై కొన్ని నెలలు కావస్తోంది.
భారత్‌లో రెండోవేవ్ వస్తే..పరిస్థితి ఏంటని మన పాలకులు ఆలోచించలేదా? వ్యాక్సిన్లను భారత్ పెద్ద సంఖ్యలో తయారుచేయటమే నిజమైతే, డిమాండ్‌కు తగ్గట్టు వ్యాక్సిన్లు ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయింది? అనే ప్రశ్నలు సామాన్యుడి మదిలో ఉదయిస్తున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుందనే ఆలోచన భారత ప్రభుత్వానికి లేదా? వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా మహమ్మారి ప్రబలితే..ఎలా? ఇప్పుడున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం సరిపోదు. దీనిని పెంచాలి..అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో హెచ్చరించింది. చొరవచేసి 'గ్లోబల్ యాక్షన్ ప్లాన్'ను కూడా రూపొందించింది. 'ఇన్‌ఫ్లూయెంజా వైరస్'ను ఎదుర్కోవటం కోసమే డబ్ల్యూహెచ్ఓ ఇదంతా చేసింది. దీని ఫలితంగా వివిధ దేశాల్లోని ఔషధ తయారీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌పై వ్యాక్సిన్లు తయారుచేశాయి. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ నుంచి మానవాళిని కాపాడటంలో డబ్ల్యూహెచ్‌వో చూపిన చొరవ చాలా గొప్పది.