Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి పైసా ప్రజల కోసమే
తిరువనంతపురం : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో లక్షలాదిమంది ప్రజల జేబులను మోడీ ప్రభుత్వం కత్తిరిస్తోంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయన్న భయం వున్నప్పటికీ వ్యాక్సిన్ ధరను నిర్ణయించే అధికారాన్ని గుత్తాధిపత్య కంపెనీలకు కట్టబెట్టడం ప్రజలకు ద్రోహం చేయడమే. స్వతంత్ర భారత దేశంలో 70ఏళ్ళుగా అమల్లో వున్న ఉచిత, సార్వత్రిక టీకా విధానాన్ని బిజెపి ప్రభుత్వం తనకు సన్నిహితంగా మెలిగే వారి కోసం ధ్వంసం చేస్తోంది. 18ఏళ్ళ నుండి 45ఏళ్ల వయస్సు వారికి వేసే టీకాలకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాలే భరించాలని అంటోంది. అసలే కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యంతో బాధపడుతుంటే ఈ అదనపు భారం రాష్ట్రాలను మరింత కుంగదీస్తుంది.
ఇంతకుముందు పలు విపత్తులను ఎదుర్కోవడంలో వ్యవహరించిన మాదిరే ఇప్పుడీ కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనడంలోను కేరళ ముందున్నది. తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచింది. కోవిడ్‌కి సంబంధించిన పరీక్షలు, వైద్యం , టీకాలు అన్నీ అక్కడ ఉచితమే. కేరళ సాధించిన విజయాన్ని చూసి సంపన్న దేశాలు సైతం విస్మయం వ్యక్తం చేశాయి. ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చారు. రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందేలా చూడాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు కలసికట్టుగా చేసిన కృషి ఫలితంగా కరోనా మరణాలను చాలావరకు తగ్గాయి. కోవిడ్ వల్ల బాగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో మరణాల రేటుతో పోల్చుకుంటే కేరళలో మరణాల రేటు (0.39శాతం) అత్యల్పం. కోవిడ్ రోగుల సంఖ్య పెరి గినా, మరణాల రేటును కట్టడి చేయగలిగింది. ఏడు దశాబ్దా లుగా అనుసరిస్తూ వస్తున్న సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్ర మానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది.
బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిచ్చే ప్రభుత్వం దేశంలో నిరుపేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి మాత్రం సిద్ధంగా లేదు. కేంద్రం సహాయ నిరాకరణ చేసినా కేరళలో ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మితవాద బిజెపి కార్పొరేట్ల పక్షం వహిస్తే, వామపక్షాలు ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తాయనడానికి ఇదొక నిదర్శనం. కార్పొరేట్లు అందించిన డబ్బు మూటలతో అధికారంలోకి వచ్చిన మోడీ నయా ఉదారావాద విధానాలు అమలు చేస్తూ, తన బాస్‌లు చెప్పినదానికల్లా తలూపుతూ, వారి సేవలో మునిగితేలుతున్నారు. దీనికి భిన్నంగా కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం ప్రజానుకూల విధానాలతో ముందుకెళ్తోంది. ప్రజల జీవితాలు, వారి ప్రాణాలు కాపాడడమే ఎల్డిఎఫ్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కేరళ అందరికీ ఆశా కిరణంగా నిలవడంలో ఇటువంటి అంశాలు అనేకం వున్నాయి. వాటిల్లో ఒకటి ఎలాంటి పిలుపు ఇవ్వకుండానే ప్రపంచవ్యాప్తంగా వున్న మలయాళీ లందరూ లక్షలాది రూపాయలు కేవలం మూడు రోజుల్లో ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సిఎండిఆర్‌ఎఫ్)కి పంపడం. వామపక్ష సంఘటన ప్రభుత్వం (ఎల్డిఎఫ్) పట్ల కేరళీయుల్లో వున్న విశ్వాసానికి ఇది ఒక సంకేతం. వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాయం కావాలని కోరగానే విదేశాల్లో వున్న కేరళీయులందరూ స్పందించారు. వ్యాక్సిన్లకు అసాధారణ రీతిలో ధరలు నిర్ణయించడం ద్వారా రాష్ట్రాలను భయభ్రాంతులకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వ విధానానికి ఈ సంఘీభావం ఒక నిరసన. కుల, మతాలకు అతీతంగా దేశ సంక్షేమం, అభ్యున్నతి కోసం కలిసికట్టుగా కృషి చేసే సమాజం కేరళలో వుంది.
ముఖ్యమంత్రి విపత్తు సహాయక నిధికి, మోడీ ప్రవేశపెట్టిన పిఎం కేర్స్‌కి మధ్య ఉన్న తేడా కూడా ఈ సందర్భంగా గమనించవచ్చు. విపత్తు సహాయ నిధికి అందచేసిన విరాళాలు విపత్తు సమయాల్లో అర్హులైన ప్రజలకు ఆహార పదార్ధాల కిట్లు, ముఖ్యమైన మందులు, వైద్య సాయం రూపంలో అందుతుంది. ఇదీ కేరళ విశిష్టత.
(ఫీచర్స్ అండ్ పాలిటిక్స్)