Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరస్ రెండో వేవ్ ఉంటుందని చెప్పిన వైద్య నిపుణులు
- మనదేశానికి వైరస్ ఎంతో సమయమిచ్చింది..
- అయినా సిద్ధం కాలేదు : రాజకీయ విశ్లేషకులు
- ఎన్నికల రాజకీయాలకు మోడీ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వటం వల్లే..
న్యూఢిల్లీ : కోవిడ్-19 వైరస్ సామాన్యమైంది కాదని.. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. అయితే వైరస్ చాలా డేంజర్..అని కొద్ది నెలల క్రితమే అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ వైరస్ గురించి తొలినాళ్లలోనే హెచ్చరించాడు. ఆనాడు అధ్యక్షుడు ట్రంప్ ఆయన మాటల్ని పెడచెవినపెట్టి, అమెరికాను ప్రమాదంలోకి నెట్టాడు. మనదేశంలో వైరస్ తన స్వరూపం మార్చుకొని మళ్లీ దాడిచేస్తుందని, రెండో వేవ్ వస్తుందని ఇక్కడి వైద్య నిపుణులూ హెచ్చరించారు. ట్రంప్‌లాగే..మనదగ్గరా మోడీ సర్కార్ సీరియస్‌గా తీసుకోలేదు.
పాలకుల అతివిశ్వాసం వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో...అమెరికా, బ్రెజిల్, బ్రిటన్ దేశాలే ఉదాహరణ. నిజానికి వైరస్ తాను విజృంభించడానికి భారత్‌కు కొన్ని నెలల సమయమిచ్చింది. లెక్క ప్రకారం గంగానదికి 2022లో కుంభమేళా నిర్వహించాలి, కానీ కొంతమంది జ్యోతిష్కుల మాటను పరిగణలోకి తీసుకొని మోడీ సర్కార్ 2021లో నిర్వహించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలోని వివిధ పట్టణాల్లో జరిగిన మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి హాజరయ్యారు.
బ్రిటన్ వైరస్ మరింత విజృంభించడానికి ఇది ముఖ్యకారణమని ఎపిడాలమిస్టులు చెబుతున్నారు. కుంభమేళాకు హాజరైనవారి వివరాలు సేకరించి, వారిని క్వారంటైన్లో పెట్టేందుకు అనేక రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆదేశాలు సైతం ఇవ్వాల్సివచ్చింది. ప్రమాదకరమైన బ్రిటన్ వైరస్ విస్తరించే అవకాశం లేకుండా చేయాల్సిన కేంద్రం, కుంభమేళాను అంగరంగ వైభవంగా జరపటమేంటని వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది సామాన్యమైంది కాదు..
'కోవిడ్ సునామీ' నుంచి దేశాన్ని కాపాడారు..అంటూ ప్రధాని మోడీని బీజేపీ, బీజేపీని ప్రధాని మోడీ ప్రశంసించుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో సక్సెస్ అయ్యామంటూ..కేంద్రం ప్రచారం చేసుకోని రోజులేదు. లాక్డౌన్, కఠినమైన ఆంక్షల ఫలితంగానే వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నామని ప్రధాని మోడీ సైతం అనేకమార్లు చెప్పారు. పదుల సంఖ్యలో రివ్యూమీటింగ్లు నిర్వహించినట్టు ప్రధాన మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇదంతా కూడా 'మీడియా మేనేజ్మేంట్' అన్నది ఇప్పుడు తేలిపోయింది. సమీక్షా సమావేశాలు సీరియస్‌గా జరిగివుంటే, నేడు దేశంలో ఈ పరిస్థితి ఉండేదా?
వైరస్ రెండో వేవ్ ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వ వైద్యరంగాన్ని అందుకు సిద్ధం చేయలేదని ప్రతి ఒక్కరికీ అర్థ మైంది.వైరస్ బారినపడ్డవారిలో సీరియస్ కేసులు 10శాతంలోపే ఉన్నా, వారికి కూడా వైద్యం అందుబాటులోకి రాకపోవటం, ఆక్సీజన్ , ఔషధాల కొరత ఎందుకు ఏర్పడిం దన్న ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పటం లేదు.
రాష్ట్రాలు చూసుకుంటాయిలే..!
కరోనా వైరస్ తాకిడికి దేశం యావత్తు వణికిపోతున్నది. బాధితులకు చికిత్స అందించడానికి ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ వసతులు కూడా సరిపోవటం లేదు. ఇది వాస్తవం. కేవలం ఆక్సీజన్ కొరతేకాదు, ఔషధాలు, డాక్టర్లు, నర్సుల కొరత కూడా తీవ్ర స్థాయిలో ఉంది. వైరస్ తాకిడిని ఒకవేళ ఊహించకపోయినా, యుద్ధ ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవటంలో, నిధులు విడుదల చేయటంలో కేంద్రం తాత్సారం చేస్తోంది. రాష్ట్రాలు చూసుకుంటాయిలే..అనే ధోరణి ప్రధాని మోడీలో కనపడుతోంది.
మరికొన్ని వారాల్లో వైరస్ మరింతగా విజృంభించబోతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో మోడీ సర్కార్ 'డిఫెన్స్'లో పడిపోయింది. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని..చెప్పి తప్పించుకుంటోంది. అంటే దేశం యావత్తు కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటే, ఎవరూ మాట్లాడరాదన్నమాట ! పాలకుల్ని ప్రశ్నించకుండా..చెప్పింది నమ్మాలి కాబోలు !
ఎన్నికలపైనే దృష్టి
గత కొన్ని నెలలుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయంపైనే మోడీ సర్కార్ దృష్టి పెట్టింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహాన్ని పక్కకు పెట్టింది. పూర్తిగా ఎన్నికల రాజకీయాలపైనే ప్రధాని మోడీ , కీలక మంత్రులు, అధికార గణమంతా దృష్టిసారించారు. వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎన్నికల ర్యాలీలు, భారీ బహిరంగ సభలు మనదేశంలో కొనసాగాయి. ఇలాంటి వాటిలో ప్రధాని మోడీ పాల్గొనటం ఏంటని విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన వెనక్కి తగ్గారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అంశం చర్చనీయాంశం కాకూడదని మోడీ సర్కార్ తెరవెనుక కొన్ని చర్యలు తీసుకుందని విమర్శకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మోడీ నాయకత్వం..అనే దానిచుట్టూతా ప్రధాన మీడియా వార్తా కథనాలు రాసింది. వైరస్ ఒక సునామీలా పెల్లుబుకేసరికి..ఎన్నికల రాజకీయాలు కొట్టుకుపోయాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే బాధ్యత ఎవరన్నదానిపై ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. ఇదంతా కూడా ప్రధాని మోడీకి రుచించటం లేదు. మనదేశంలో రాజకీయ నాయకత్వ వైఫల్యాన్ని కరోనా వైరస్ స్పష్టంగా బయటపెట్టింది.