Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా కొత్తగా 3.46లక్షల కేసులు, 2624 మంది బలి
- రైల్వేలో 93 వేల మంది ఉద్యోగులకు కరోనా
న్యూఢిల్లీ: కరోనా రక్కసి విజృంభణ కొనసాగుతోంది. తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న వైరస్.. దేశంలో పరిస్థితులను రోజురోజుకూ దారుణంగా మారుస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసుల నమోదుతోపాటు వైరస్ మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలోని ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రజల్లో భయాందోళనలు అధికమవుతు న్నాయి. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 3,46,786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదుకాలేదంటే భారత్‌లో కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే, కొత్తగా 2,624 మంది వైరస్‌తో మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 1,89,544కు చేరగా, పాజిటివ్ కేసులు 1,66,10,481కి పెరిగాయి. ఇప్పటివరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
93 వేల మంది రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్
భారతీయ రైల్వేలో దాదాపు 93 వేల మందికి కరోనా సోకిందని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ వెల్లడించారు. వైరస్ బారినపడుతున్న రైల్వే ఉద్యోగుల సంఖ్య కొద్ది వారాల నుంచి తీవ్రమైందని తెలిపారు. కరోనా సోకిన రైల్వే ఉద్యోగులకు రైల్వేస్‌కు సంబంధించిన 72 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు.
30 మంది కరోనా రోగుల పరార్ !
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన 30 మంది యువకులు కోవిడ్-19 కేర్ సెంటర్ నుంచి పరారీ అయిన ఘటన త్రిపురలోని అరుంధతి నగర్లో చోటు చేసుకుంది. బుధవారం జరిగినఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసి ంది.త్రిపుర స్టేట్ రైఫిల్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరైన వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు.65 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్-19 సెంటర్‌కు తరలించారు. ఈ క్రమంలోనే ఆ సెంటర్ నుంచి 30 మంది పరారీ అయ్యారు.
ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత..
మరోవైపు టీకాల కొరత
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వైద్యారోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ కొరతతో పాటు టీకాల కొరత కారణంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తాజాగా కరోనా టీకాల కొరత కారణంగా పలు వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడ్డాయి. ఒక్కముంబయి నగరంలోనే 52 టీకా కేంద్రాలను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వలు శనివారం కొద్ది గంటలకే సరిపోతాయనీ, ఈ క్రమంలోనే 52 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపారు. టీకాలు అందిన వెంటనే వాటిని తిరిగి తెరుస్తామన్నారు.
కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మతి
కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా జాబాట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా కరోనాతో కన్నుమూశారు. ఈ నెల 15న ఆమెకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు.
కేరళలో 48 గంటలు లాక్డౌన్ !
దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. పరిస్థితులు మరింత దారుణంగా మారకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సేవలు మినహా అన్నింటిపై పలు ఆక్షలు విధించింది. తాజాగా 48 గంటల పాటు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నట్టు కేరళ సర్కారు ప్రకటించింది. వైద్య ప్రయాణాలు సహా అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక జమ్మూకాశ్మీర్‌లో వారంతపు కర్ఫ్యూను విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 18 నుంచి 45 ఏండ్లలోపు వారికి ఉచితంగా కరోనా టీకా అందిస్తామని హర్యానా ప్రభుత్వ పేర్కొంది. ఒడిశా సైతం రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో వారంతపు లాక్‌డైన్ విధించింది.