Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది మృతి, 8 మంది గల్లంతు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో మరో ఘోర హిమపాత ప్రమాదం చోటుచేసుకుంది. ఛమోలీ జిల్లా నీతీ లోయకు సమీపంలో శుక్రవారం భారీ హిమపాతం కారణంగా మంచుచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలో కోల్పోగా, ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో 430 మంది కార్మికులను సహాయ సిబ్బంది రక్షించగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జోషిమత్కు ఉత్తరాన ఉన్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ)కు చెందిన కార్మికుల క్యాంపులపై ఈ హిమపాతం విరుచుకుపడింది. ఈ ప్రాంతంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆ సమయంలో వందల మంది కార్మికులు సుమ్నా-రిమ్ఖిమ్ రహదారి పనుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. మంచుచరియలు విరిగిపడడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భప్కుండ్ నుంచి సుమ్నా వెళ్లే మార్గాన్ని సరిచేసేందుకు జోషిమత్ నుంచి వచ్చిన సరిహద్దు రహదారుల టాస్క్ఫోర్స్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించారని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛమోలీలో భారీ మంచుచరియలు విరిగిపడటంతో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.