Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి ప్రముఖుల లేఖ
జలంధర్ : నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఐదు నెలల నుంచి అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళనలపై చర్చించి, ప్రతిష్టంభనకు తక్షణమే ముగింపు పలకాలని కోరుతూ ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌కు పలువురు ప్రముఖులు లేఖ రాశారు. ఈ చట్టాల పట్ల ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)ను ఈ పౌర సంఘాల సభ్యులు కోరారు. కేంద్రానికి లేఖ రాసిన వారిలో మాజీ వైస్ చాన్సలర్స్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యులు, వ్యవసాయ నిపుణులు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ప్రముఖ జర్నలిస్టులు, ఇతరులు ఉన్నారు. కేంద్రం మొండి వైఖరి కారణంగా రైతులు శారీరకంగా, మానసికంగా ఎంతో వేదన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనలో ఉన్న మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువత గత కొన్ని రోజులుగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే 300 మంది ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని పేర్కొన్నారు. రైతులు తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. చలి, వేసవి కాలాల్లో అక్కడ నివసించడం అంత సులభమేమీ కాదని, ఇది దీర్ఘకాలం ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతన్నకు న్యాయం చేయాలని కోరారు. రైతులను తక్షణమే మరోసారి చర్చకు పిలిచి.. పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. హర్యానాలోని సంఘ్వాన్ ఖాప్ చాలీస్ అధ్యక్షుడు సోంబీర్ సంఘ్వాన్ నుంచి లేఖను అందుకున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి రైతు ఉద్యమానికి మద్దతు తెలపడం గమనార్హం.