Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న కేంద్రం
- సుప్రీంచెప్పినా బేఖాతరు
- పెరుగుతున్న ఆక్సిజన్ మరణాలు
- ప్రాణవాయువు అందక ఢిల్లీలో 20 మంది: పంజాబ్‌లో ఆరుగురు మృతి
ఏప్రిల్ 22... గురువారం గంగారాం ఆస్పత్రి.. ఆక్సిజన్ అందక 25 మంది మృతి
ఏప్రిల్ 24... జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి... గాల్లో కలిసిపోయిన 20 మంది ప్రాణాలు
ఏప్రిల్ 24... పంజాబ్ ఆస్పత్రి.. ప్రాణవాయువులేక ఆరుగురు మృతి
దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని కీలక నగరాల్లో కరోనా సునామీలా ముంచుకొచ్చింది. ఆక్సిజన్ కొరత వెన్నాడుతుందని ఢిల్లీ సీఎం సహా పలు రాష్ట్రాల ప్రధాన మంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యమే కేంద్రం సమాధానమైంది. మా ఆస్పత్రికి ప్రాణవాయువు కావాలంటూ కొన్ని ఆస్పత్రులు కోర్టు గడపనెక్కాయి. ప్రాణవాయువు అందక ప్రాణాలు విడుస్తున్న కోవిడ్ రోగుల సంఖ్య ఒకటి కాదు.. ఇద్దరు కాదు.. వందలకు చేరుకుంటున్నది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్ పేషెంట్.. ప్రాణాలతో బయటకు వస్తాడన్న భరోసా లేకుండా పోయింది. ప్రాణవాయువు అందక అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటానికి కారకులెవ్వరు? దీనికి బాధ్యుత ఎవరిది? కరోనా రెండో వేవ్ ముంచుకొస్తుంటే ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఎన్నికల చుట్టూ తిరిగింది... చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా ప్రాణవాయువును అక్కడి నుంచి తెప్పిస్తున్నాం.. ఇక్కడ నుంచి తెప్పిస్తున్నామంటూ హడావుడిచేస్తున్న కేంద్ర సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ, అమృత్సర్ : వీవీఐపీలు అధికంగా ఉండే దేశరాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు తీవ్రంగా మారాయి. పలు ప్రముఖ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలోనూ ఇదే ఘటన సంభవించింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చికిత్స పొందుతున్న కరోనా రోగులలో కనీసం 20 మంది ప్రాణాలు విడిచారు. అంతేకాదు, ఆస్పత్రిలో ఆక్సిజన్ కొన్ని నిమిషాలకు మాత్రమే సరిపడా ఉండటంతో చికిత్స పొందుతున్న దాదాపు మరో 200 మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ మేరకు జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి వెల్లడించింది. 'ఆక్సిజన్ కొరతతో శుక్రవారం రాత్రి 20 మంది చనిపోయారు. కేవలం 30 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మా దగ్గర ఉన్నది' అని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డీకే బలుజా తెలిపారు. 200 మంది రోగుల్లో 80 మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారనీ, మరో 35 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, ఈ విషయంలో సదరు ఆస్పత్రి యాజమాన్యం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చివరి నిమిషంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దేశరాజధానిలోని అన్ని ఆస్పత్రులూ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పెద్ద ఆస్పత్రులు సైతం ఇప్పటికే డిమాండ్‌కు తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. పరిస్థితులు నానాటికి దిగజారిపోవడంతో తమకు ఆక్సిజన్‌ను సరఫరా చేయాలనీ, లేకపోతే కొత్త పేషంట్లను అడ్మిట్ చేసుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
పంజాబ్‌లోనూ..
ఆక్సిజన్ కొరత కారణంగా పంజాబ్‌లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆరుగురు కరోనా రోగులు చనిపోయారు. అమృత్‌సర్‌లోని నీల్కాంత్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో
శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. కరోనా సంక్షోభం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ప్రాధాన్యమివ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని అధికారులు ఆరోపించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు ఆక్సిజన్ కొరతతో ఉన్నాయనీ, అధికారుల నిర్లక్ష్యం తమ కుటుంబీకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లోని ఆస్పత్రుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు పంజాబ్‌కు పాకడం ఆందోళనను కలిగిస్తున్నది.
''రాష్ట్ర ప్రభుత్వానికి మేం అనేకసార్లు విజ్ఞప్తులు పంపించాం. కోవిడ్ పేషెంట్లు లేని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ మిగులు అధికంగా ఉన్నది. తీవ్ర కఠిన పరిస్థితుల్లోనూ గత 48 గంటల్లో మేము అన్ని ప్రయత్నాలను చేశాం. ప్రభుత్వం సాయం చేయకపోతే ప్రయివేటు ఆస్పత్రులు మూసివేయాలా? మేమెక్కడికి వెళ్లాలి?' అని నీలాకాంత్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ దేవగన్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమవుతుందనీ, మెడికల్ ఆక్సిజన్ అక్రమ రవాణా చేసేవారిపై చర్యలుంటాయని చెప్పారు. ఆక్సిజన్ కొరతే రోగుల మృతికి కారణమా? అన్న విషయంపై విచారణ కొనసాగుతున్నదనీ, త్వరలో నిజాలు బయటకు వస్తాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హుస్సన్ తెలిపారు.