Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి సీతారాం ఏచూరి లేఖ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకూ, రోగులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవాల్సిన తక్షణావశక్యత వుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. అలాగే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. కోవిడ్ సెకండ్ వేవ్ కనీవినీ ఎరుగని రీతిలో సృష్టించిన ఈ ఆరోగ్య, మానవతా సంక్షోభం సునామీలా ముంచుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరితో పరిస్థితి మరింత తీవ్రమవుతున్నది. వేలాదిమంది మన సహచరులు మరణిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లే సమయం కూడా కాదని ఆ లేఖలో ఏచూరి పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతా ప్రాతిపదికన రెండు విషయాల్లో మీరు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి వుంది. దేశవ్యాప్తంగా గల ఆస్పత్రులకు, రోగులకు ఆటంకం లేకుండా మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఎలాగైనా సరే ఆక్సిజన్‌ను సమకూర్చుకోవాలి. సార్వజనీన వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందచేయాలి. మరిన్ని మరణాలను నివారించేందుకు గానూ భారత వ్యాక్సిన్ల తయారీని అత్యవసర నిబంధనల కిందకు తీసుకురావాలి. అందుబాటులో వున్న వనరుల నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలని ఏచూరి ఆ లేఖలో కోరారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థికపరమైన అంశాలు వుంటాయని తెలుసు. కేంద్ర బడ్జెట్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేటాయించిన రు.35వేల కోట్లను తక్షణమే ఖర్చు చేయాలి. ఢిల్లీలో కొత్త సెంట్రల్ విస్తా నిర్మాణ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలి. అన్ని అనవసరపు ఖర్చులను నిలిపివేయాలి. పీఎం కేర్స్ నిధి కింద వసూలవుతున్న నిధుల వివరాలను పారదర్శకంగా విడుదల చేయాలి. ఆ మొత్తాలను ఆక్సిజన్, వ్యాక్సిన్ల సరఫరాకు బదిలీ చేయాలని ఆ లేఖ కోరింది. ప్రజలకు అవసరమైన ఆక్సిజన్, వ్యాక్సిన్లను అందచేసి, మరణాలను నివారించలేని పక్షంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు ప్రభుత్వానికి వుండదని ఏచూరి స్పష్టం చేశారు. ఈ ఆరోగ్య, మానవతా సంక్షోభాన్ని కచ్చితంగా నివారించవచ్చు, నివారించాలి కూడా. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన మౌలిక బాధ్యత ఇది. దీన్ని నిర్వహించడంలో ప్రభుత్వం ఇప్పటివరకు విఫలమైందని ఏచూరి పేర్కొన్నారు.