Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్, కరోనా టీకాలపై కస్టమ్ డ్యూటీ,
- ఆరోగ్య సెస్ మాఫీ
- ఉచితంగానే రాష్ట్రాలకు కోవిడ్-19 టీకాలు
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో తాజాగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా టీకాలు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్‌ను తక్షణమే మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది మూడు నెలల కాలానికి అమల్లో ఉంటుందని తెలిపింది. కరోనా పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేం దుకు తీసుకున్న చర్యలు, కరోనా టీకాలపై ప్రధాని సమీక్ష జరిపారు. తాజా నిర్ణయం ఆయా వస్తువుల లభ్యతను పెంచడమే కాక చౌకగా లభించేలా చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ప్రభుత్వం పేర్కొన్న జాబితాలో కరోనా టీకాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఫిల్లింగ్ సిస్టమ్స్, కంటైనర్లు, ట్రాన్స్పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు ఉన్నాయి.
రాష్ట్రాలకు ఉచితంగానే టీకాల సరఫరా
కరోనా వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. కరోనా ఒక డోసును రూ.150కే తయారీ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఇటీవల ఓ టీకా తయారీ సంస్థ కేంద్రానికి ఒక డోసుకు రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రయివేటు ఆస్పత్రులకు రూ.600కు సరఫరా చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.