Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చే సందర్శకులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేయనున్నారు. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రా, ఉనా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున కర్ఫ్యూ విధించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుంచి మే 10 వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు. కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు అమలులో ఉంటుంది. ఈ కర్ఫ్యూ సమయంలో ఎవరు కూడా బయట తిరుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
హిమాచల్‌కు వచ్చే సందర్శకులందరికీ 72 గంటల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయాలని కూడా నిర్ణయించారు. ఒకవేళ ప్రజలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోకపోతే, వారు 14 రోజులు గృహ నిర్బంధంలో / ఒంటరిగా ఉండవలసి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా మార్గదర్శకాలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.