Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు : యూనివర్సిటీ ఉద్యోగుల సమస్యలపై పోరాడిన ఉద్యమ నాయకులు చిట్టిపోతు హరిబాబు (69) ఆదివారం సాయంత్రం గుంటూరులో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన హరిబాబు గుంటూరులోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భార్య ప్రమీల, కుమార్తెలు సజన, జ్వలిత ఉన్నారు. ప్రమీల మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. సీపీఐ(ఎం) సభ్యుడుగా పార్టీ పట్ల ఎంతో అంకితభావం పనిచేస్తున్న హరిబాబు 8 ఏండ్లక్రితం నాగార్జున యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్టార్‌గా ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్ అయిన అనంతరం '' విశ్వ ఉద్యోగి'' పత్రికకు సంపాదకునిగా వ్యవహరించి దానిని నడపడంలో కీలక పాత్ర పోషించారు. 1975లో తొలుత ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగిగా చేరి ఉద్యోగుల సమస్యలపై పోరాడారు. రాష్ట్రంలో యూనివర్సిటీ ఉద్యోగుల ఉద్యమ నిర్మాతల్లో ఆయన ఒకరు. పార్టీ కార్యక్రమాలను, సిద్ధాంతాలను, ఆలోచనలని ముందుకు తీసుకు వెళ్ళారు. గుంటూరు నగర కమిటీ సభ్యుడుగా కీలక భూమిక పోషించారు. ఉద్యోగం నుండి రిటైర్ అయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా గుంటూరు జిల్లా అమరవీరుల గురించి సమాచార సేకరణ, పుస్తకం ప్రచురణలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఎం.వి.ఎస్.కోటేశ్వరరావు స్కూలు బాధ్యతలు చూస్తున్నారు. స్కూల్ అభివృధికి తన శాయ శక్తులా కృషి చేశారు. హరిబాబు మృతికి ఎం.ఎల్.సి.కే.ఎస్. లక్ష్మణరావు, సీపీఐ(ఎం) తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. హరిబాబు భౌతికకాయానికి గుంటూరు నగరంలోని బొంగరాలబీడు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.