Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలు చేస్తున్న రైతులపై
మోడీ టీం నిందలు
- ట్యాంకర్ల సరఫరా అడ్డుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారాలు
- వైరస్ వ్యాప్తికీ కారణమవుతున్నారంటూ ఆరోపణలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో తగిన సంఖ్యలో బెడ్లు లేవు. రెమ్‌డెసివిర్, వ్యాక్సిన్ల కొరత కరోనా రోగుల ప్రాణాలను హరిస్తున్నాయి. మోడీ సర్కారుకు ముందు చూపు లేకపోవడంతో దేశంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోగ్యనిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత దేశంలోని అనేక రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కానీ, కేంద్రం మాత్రం ఆక్సిజన్ సరఫరాను రాజకీయంగా వాడుకుంటున్నది. ఈ విషయంలో చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నదని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నారని బీజేపీ అనుచరగణం నిందలు వేస్తున్నది. అంతేకాకుండా, వైరస్వ్యాప్తికీ కారకులవుతున్నారంటూ ఆరోపిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు తెరలేపింది. దీనికి తోడు మోడీ అనుకూల మీడియా కూడా ఆ విష ప్రచారానికి ప్రాధాన్యతను కల్పిస్తూ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
గతేడాది దేశంలో నెలకొన్న కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నుంచి కేంద్రం ఇప్పటి వరకూ పాఠాలు నేర్వలేదని ఆరోగ్య నిపుణులు అన్నారు. దేశంలో దాదాపు 162 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడానికి కొన్ని నెలల క్రితం కేంద్రం టెండర్లకు పిలిచింది. అయితే, పనిలో చిత్తశుద్ధి లేకపోవడం, దానికి నిర్లక్ష్యం తోడవడంతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపం దాల్చలేదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. దీని ఫలితంగానే ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి రోగుల ప్రాణాలను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రం, బీజేపీ టీం నైతిక విలువలకు తిలోదకాలిస్తూ కుటిల రాజకీయాలకు పాల్పడుతన్నదని చెప్పారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిఘా సంస్థలు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయిని రాజకీయ నిపుణులు ఆరోపించారు. దేశంలో రాబోయే ఈ కఠిన పరిస్థితులను ఆరోగ్యశాఖ అంచనా వేయలేకపోవడం కేంద్రం పనితీరుకు అద్దం పడుతున్నదని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద దీక్షలు చేస్తున్న రైతులపై నిందలు వేసి ఇటు తమపై నిందను చెరుపేసుకోవడం.. అటు రైతుల ఆందోళనలకు చెక్ పెట్టాలని కేంద్రం భావించదని చెప్పారు. '' ప్రస్తుతం దేశం తీవ్ర ముప్పులో ఉన్నది. ఈ భయంకరమైన వ్యాధితో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. ప్రజలకు అన్నం పెట్టే మాకు ప్రాణం విలువ తెలుసు. మాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏ మాత్రమూ నిజం కావు. ట్రాక్టర్లను రోడ్డు పక్కల పార్క్ చేసి రోడ్లకు ఇరుపక్కల తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకున్నాం. అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు రోడ్డుపై స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. అయితే, మేము ఎక్కడా ఆక్సిజన్ ట్యాంకులను అడ్డుకోలేదు'' అని రైతులు వెల్లడించారు. తమ పోరాటం నల్ల చట్టాలు, కేంద్రంపై అని తెలిపారు.
మోడీ.. విమానాలు కొనడానికి రూ. 8400 కోట్లు వెచ్చిస్తారు. కొత్తపార్లమెంటు నిర్మాణానికి రూ. 20వేల కోట్లు ఖర్చు చేస్తారు. కానీ, ఆస్పత్రుల నిర్మాణాలు, టీకాలు, సిలిండర్ల కోసం ఖర్చు చేయడానికి మాత్రం కేంద్రం వద్ద నిధులు లేవా? అన్ని సామాజిక కార్యకర్తలు ప్రశ్నించారు.