Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన వదంతులను పట్టించుకోవద్దని ప్రధాని మోడీ అన్నారు. ప్రతినెలా చివరలో జరిగే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 78వ ఎడిషన్‌లో దేశప్రజలను ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, తీసుకుంటున్న చర్యల విషయంలో ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. దేశంలో 45 ఏండ్లు పైబడిన వారికి ఇప్పటికే వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించామనీ, అది అలాగే కొనసాగుతుందని చెప్పారు. మే1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని మోడీ తెలిపారు. అయితే, ఈ ఉచిత వ్యాక్సిన్ ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో కరోనా సెకండ్‌వేవ్ మన సహనాన్ని పరీక్షిస్తోందని అన్నారు. మనకు కావాల్సినవారు, బంధువులు ఎందరో ఈ కాలంలో ప్రాణాలు కోల్పయారని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులు, ఒక అంబులెన్స్ డ్రైవర్‌తో మాట్లాడారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల విషయంలో వారి విధులు, జరుగుతున్న పరిణామాలు, వారి ఆలోచనలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ప్రతీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ :
కేంద్రం కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సపోర్ట్‌కి విపరీతమైన డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 551 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. త్వరలోనే ఈ ప్లాంట్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.