Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూరత్‌లో చెరుకు పరిశ్రమల నుంచి సేకరణ
- శ్మశాన వాటికల్లో ఎండుకట్టెలు, కిరోసిన్, డీజిల్ కొరత
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. వైరస్‌బారినపడి రోజూ మరణి స్తున్నవారి సంఖ్య భారీగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో వస్తున్న కోవిడ్ మృత శరీరాలకు దహన సంస్కారాలు చేయ డానికి సూరత్‌లోని శ్మశాన వాటికల్లో ఎండుకట్టెలు సరిపోవటం లేదు. దాంతో దహన క్రియలకు చెరుకు పిప్పి (బగాసే)ని వాడుతున్నారు. సూరత్‌లోని చెరుకు పరిశ్రమలు తమ వద్ద ఉన్న చెరుకు పిప్పిని దహనవాటికలకు పంపుతున్నాయి. పాల్, ఓల్పాడ్లలోని శ్మశాన వాటికలకు స్థానికంగా ఉన్న ' సాయన్ షుగర్ ఫ్యాక్టరీ ' 20 టన్నుల చెరుకు పిప్పిని ఉచితంగా సరఫరా చేసింది. చెరుకు నుంచి చక్కెర తయారీచేసే క్రమంలో ఏర్పడే చెరుకు పిప్పి(బగాసే)ని కాగితం తయారీ పరిశ్రమలు కొనుగోలు చేస్తాయి. బయట మార్కెట్లో టన్ను బగాసేను చక్కెర ఫ్యాక్టరీలు రూ.900కు అమ్ముతుం టాయి. అలాగే చెరుకు, ఇతర పరిశ్రమల్లో బాయిలర్లను మండించడానికి ఇంధనంగా కూడా బగాసేను వాడుతారు. అయితే సూరత్‌లో కోవిడ్ మృత శరీరాలకు అంత్యక్రియలు నిర్వర్తించడానికి పెద్ద ఎత్తున ఎండుకట్టెలు, కిరోసిన్, డీజిల్ అవసరమవుతున్నాయి. శ్మశానవాటికల్లో ఎండుకట్టెలు, ఇంధనం కొరత ఉందని తెలియటంతో, దహన క్రియలకు చెరుకు పిప్పిని వాడుకోమంటూ చక్కెర ఫ్యాక్టరీలు ముందుకొచ్చాయి.
ఓల్పాడ్లో(సూరత్) ఒక స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలోని శ్మశాన వాటికలో దహన క్రియలకు చెరుకు పిప్పిని మొదటిసారిగా వాడారు. సూరత్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రతిరోజూ శ్మశాన వాటికలకు 15 టన్నుల ఎండుకట్టెలను సరఫరా చేస్తున్నా..అది సరిపోవటం లేదు. ఈ సమస్య నుంచి బయటపడటానికి బగాసే చక్కగా పనిచేస్తుందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
చెరుకు ఫ్యాక్టరీలు 20 టన్నుల బగాసే సరఫరాచేస్తే, రెండు శ్మశాన వాటికలు కొన్ని నెలల వరకు వాడుకుంటాయని సాయన్ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ రాకేశ్ పటేల్ చెప్పారు.