Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ జస్టిస్ రమణకు కప్పన్ భార్య లేఖ
న్యూఢిల్లీ : కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన భార్య రైహంత్ కప్పన్ తరపున న్యాయవాది విల్స్ మాథ్యూస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణకు ఆదివారం ఒక లేఖ రాశారు. ఇటీవల కరోనా సోకిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన జీవితం ప్రమాదంలో ఉందని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చారు. మథురలోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఆయన్ను ఒక మంచంపై జంతువును కట్టేసినట్టు కట్టేశారని, కదలిక లేకుండా పడివున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోలేరని, టాయిలెట్‌కు కూడా వెళ్లలేని క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ఆయన్ను వెంటనే మథుర ఆస్పత్రి నుంచి మథుర జైలుకు తిరిగి తరలించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో చీఫ్ జస్టిస్‌ను కోరారు. వెంటనే తగిన చర్యలు తీసుకోకుంటే, అది కప్పన్ అకాల మరణానికి దారితీస్తుందని పేర్కొన్నారు. కప్పన్‌ను విడుదల చేయా లని కోరుతూ గతేడాది అక్టోబర్ 6న దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఏడు సార్లకు పైగా లిస్టింగ్ చేసినా, ఇప్పటికి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. పలు మలయాళీ వార్తాసంస్థలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్న కప్పన్‌ను గతేడాది ఆక్టోబర్ 7న ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీలో హత్రాస్ లైంగికదాడి ఘటనను రిపోర్టు చేసేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు అదుపు లోకి తీసుకొని యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కప్పన్‌ను ఢిల్లీ ఎయిమ్స్ తరలించాలని కోరుతూ కేరళ యూనియన్ ఆఫ్ జర్నలిస్టులు ఈ నెల 20న సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.