Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే మూడున్నర లక్షల కేసులు
- క్రమంగా పెరుగుతున్న మరణాలు
- పది రాష్ట్రాల్లోనే 74శాతం కోవిడ్
- ఢిల్లీలో లాక్డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి సునామీల విరుచుకుపడుతున్నది. దీంతో వైరస్ బారినపడుతున్న వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వరుసగా నాల్గో రోజు సైతం ప్రపంచ రికార్డు సృష్టిస్తూ కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 3,49,691 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 2,767 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 1,92,311కు చేరగా, పాజిటివ్ కేసుల 1,69,60,172కు పెరిగాయి. ఇప్పటివరకు 1,40,85,110 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పంజా నేపథ్యంలో వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిర్థారణ పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 14,09,16,417 మందికి టీకాలు అందించారు. అలాగే, మొత్తం 27,79,18,810 కరోనా పరీక్షలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా సోకింది. తనతోపాటు తన భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఆయన తెలిపారు. ప్రస్తుతం హౌం క్వారంటైన్లో ఉన్నానని చెప్పారు. బెంగాల్‌లోని ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కాజల్ సిన్హా కన్నుమూశారు.
ఇదిలావుండగా, దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 74 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది. మరణాలు సైతం ఈ రాష్ట్రాల్లోనే అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించింది. పై పది రాష్ట్రాల్లోనే 69.94 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఢిల్లీలో మరో వారంపాటు లాక్డౌన్
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 పంజా విసురుతున్నది. దీంతో ఇదివరకు విధించిన లాక్‌డౌన్‌ను మరో వారంపాటు పొడిగిస్తున్నట్టు తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. లాక్డౌన్ విధించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత భయంకరంగా మారే అవకాశముందనీ, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో తయారీదారులు, సరఫరాదారులు, ఆస్పత్రులతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. రెండు గంటలకొకసారి సమాచారం తెలిసేలా పోర్టల్‌ను ప్రారంభించినట్టు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అధికార బృందాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు.
హిమాచల్‌లో 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఈశాన్య భారత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా ప్రభావం పెరుగుతుం డటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. దీనిలో భాగంగా కేసులు అధికంగా నమోదవుతున్న కాంగ్రా, ఉనా, సోలస్, సిర్మౌర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. అలాగే, రాష్ట్రానికి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది.
తమిళనాడు సండే సంపూర్ణ లాక్డౌన్ !
కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మరిన్ని ఆంక్షలు తీసుకొస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
దాంతో రాజధాని చెన్నై సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అలాగే, సోమవారం నుంచి రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలు అమల్లోకి తీసుకురానుంది.
సైన్యంలో 97 శాతం మందికి అందిన టీకాలు
దేశ సైన్యంలో 97 శాతం మందికి ఫస్ట్ డోస్, 76 శాతం మందికి సెకండ్ డోస్ టీకాలు ఇచ్చినట్టు తాజాగా రక్షణ శాఖ ప్రతినిధులు వెల్లడించారు. త్రివిధ దళాలు కలిపి మొత్తంగా 15.5 లక్షల మంది సైనికులు పస్ట్ డోస్ టీకాను తీసుకున్నారనీ, సైన్యంలోని లక్ష మంది ఆరోగ్య సిబ్బందీ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. 11.7 లక్షల మంది సైనికులు సెకండ్ డోస్ కూడా తీసుకున్నారనీ, 90 వేల మంది ఆరోగ్య సిబ్బందీ సెకండ్ డోస్ వేయించుకున్నారని స్పష్టం చేశారు.