Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవాలకు, ప్రభుత్వ వివరాలకు కుదరని పొంతన
అహ్మదాబాద్ : గుజరాత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న కోవిడ్ మరణాల సంఖ్యకు, ఆస్పత్రులు, శ్మశానవాటికల నుంచి వస్తున్న వివరాలకు అసలు పొంతన వుండడం లేదు. రెండింటి మధ్య అంతరం బాగా పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బులెటిన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆదివారం 157 మంది కోవిడ్‌తో మరణించారు. శనివారం ఈ సంఖ్య 152గా వుంది. కానీ, అహ్మదాబాద్, సూరత్, మరికొన్ని జిల్లాల ప్రధాన ఆస్పత్రుల నుంచి వచ్చిన వివరాలు చూసినట్లైతే ఈ సంఖ్య కన్నా చాలా రెట్లు ఎక్కువగా వున్నాయి. అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన 1,200 పడకల సివిల్ ఆస్పత్రి నుంచి రోజూ 125 వరకు మృతదేహాలు వెళుతున్నాయని ఉన్నత స్థాయి వర్గాలు మీడియాకు తెలిపాయి. అలాగే సూరత్‌లో కూడా ఆదివారం సాయంత్రానికి సివిల్ ఆస్పత్రి నుంచి 67 మృతదేహాలు, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న స్మిమెర్ ఆస్పత్రి నుంచి 34 మృతదేహాలు వెళ్ళాయి.
అధికారికంగా ఆరోగ్యశాఖ వెల్లడిస్తున్న మరణాల కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని సీనియర్ అధికారి తెలిపారు. మరణించిన వారిలో చాలామంది ఒకటి కన్నా ఎక్కువ జబ్బులతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. ఈ రెండు ప్రధాన నగరాల్లో శ్మశాన వాటికల్లో కొత్త ఫర్నేస్‌లు ఏర్పాటు చేశారు. అవి 24 గంటలూ పనిచేస్తూనే వున్నాయి. ఈ రెండు నగరాలు కాకుండా గ్రామీణ జిల్లాల్లో పరిస్థితి కూడా చాలా ఘోరంగా వుంది. మారుమూల గ్రామాల్లో కనీస ఆరోగ్య సదుపాయాలు కూడా లేవు. కచ్ జిల్లాలో శనివారం వందకు పైగా మరణాలు సంభవించాయి. భౌగోళికంగా కచ్ చాలావిస్తారమైన ప్రాంతం. జనాభా చాలా తక్కువగా వుంటుంది. అటువంటిది అక్కడే అన్ని మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఆలోచించుకోవచ్చు. కచ్ జిల్లా ప్రధాన కేంద్రమైన భుజ్‌లో మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసేందుక సమయం, స్థలం కూడా సరిపోవడం లేదని స్థానిక రాజకీయ నేత ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. శ్మశానాల్లో అవసరమైన కలప కూడా కొరవడుతోందని అన్నారు. మరో మూల జిల్లాయైన పాటన్‌లో శని, ఆదివారాల్లో 17 మంది మరణించారు. వీరిలో ఆరుగురు ఆస్పత్రిలో బెడ్ కోసం అంబులెన్సులో వేచి చూసి చూసి.. చనిపోయారు.
'మే'లో మహా ప్రళయమే !
దేశంలో కరోనా వైరస్ సునామీ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే, రానున్న రోజుల్లో భారత్‌లో కరోనా మహా ప్రళయమే సృష్టించనుందని పలు వర్సిటీల అధ్యయనాల అంచనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఐఐటీ కన్పూర్ పరిశోధకుల బృందం.. మే నెల మధ్య నాటికి దేశంలో క్రియాశీల కేసులు దాదాపు 50 లక్షలకు (38-48) చేరుకుంటాయని అంచనా వేసింది. మే మొదటి వారంలో రోజువారీ కేసులు సైతం దాదాపు 4.4 లక్షల గరిష్టాన్ని తాకవచ్చునని పేర్కొంది. అలాగే, కన్పూర్, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన మరో పరిశోధకుల బృందం మే మధ్య నాటికి క్రియాశీల కేసులు 10 లక్షలు దాటుతాయనీ, మరణాలు సైతం భారీగా పెరుగుతాయని తెలిపింది. కాగా, గత వారం కాన్పూర్ వర్సిటీ పరిశోధకులు కరోనా మహమ్మారి విజృంభణతో మే 11-15 మధ్య నాటికి క్రియాశీల కేసులు 33-35 లక్షల గరిష్టాన్ని తాకి మే చివరి నాటికి బాగా క్షీణించవచ్చుని అంచనా వేసింది.