Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా సెకండ్‌వేవ్‌కు కారకులు మీరే
- అధికారులేమైనా ఇతరగ్రహాలపై ఉంటున్నారా! : ఈసీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
చెన్నై: భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశంలో కోవిడ్-19 ఉపద్రవం ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఎలా ఇస్తారని ఈసీని నిలదీసింది. ఎలక్షన్ కమిషన్‌ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విరుచుకుపడటానికి ఏకైక కారణం ఎన్నికల సంఘమేనని వ్యాఖ్యానించారు. అధికారులేమైనా ఇతరగ్రహాలనుంచి వచ్చారా! అసలిదేం తీరు అంటూ ఆక్షేపించింది. ర్యాలీలకు అనుమతినిస్తూ కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన ఈసీపై మర్డర్ కేసు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఇన్ని కేసులు పెరిగిపోవడానికి నైతిక, ఏకైక బాధ్యత ఈసీదేనన్నారు. 'ఎన్నికల అధికారులపై మర్డర్ కేసులు నమోదు చేయండి.
కోర్టులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ... తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కోవిడ్ నిబంధనలను అమలుపర్చడంలో ఎన్నికల సంఘం విఫలమైంది' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కోవిడ్-19 అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని ఈసీ తరఫు న్యాయవాది తెలుపగా... ఎన్నికల ర్యాలీలు చేస్తున్నప్పుడు మీరు మరో గ్రహంపై ఉన్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారంలో చాలామంది ఫేస్ మాస్క్‌లు ధరించలేదనీ, శానిటైజర్లు వినియోగించలేదనీ, భౌతిక దూరం పాటించలేదని నిలదీసింది. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం రాజ్యాంగ సంస్థల కర్తవ్యమనీ, ఈ విషయాన్ని అధికారులకు పదేపదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పౌరులు బతికుంటేనే వాళ్లు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల ప్రయోజనం పొందగలు గుతారని చీఫ్ జస్టిస్ గుర్తుచేశారు.
ఓట్ల లెక్కింపు రోజు కొవిడ్-19 ప్రోటో కాల్స్ అమలు చేసేందుకు తీసుకోబోయే చర్యలతో కూడిన యాక్షన్ ప్లాన్ బ్లూ ప్రింట్‌ను సమర్పించకపోతే మే2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను రద్దు చేస్తామని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు. ఏప్రిల్ 30న కోర్టు మరోసారి కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష జరుపు తుందని కోర్టు తెలిపింది. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మే 2న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.