Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 2812 మరణాలు.. ఐదోరోజూ మూడులక్షలకుపైనే..
- కర్నాటకలో లాక్డౌన్..
- కేరళలో వారంతపు మినీ లాక్డౌన్
దేశంలో కరోనా ప్రళయం సృష్టిస్తూనే ఉన్నది.పడకల్లేవ్..వ్యాక్సిన్ లేదు. ఆక్సిజన్ లేక అవస్థలు..ఇలా ఎటుచూసినా రోగుల రోదనలు..బంధువుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఐదో రోజూ మూడులక్షలకుపైగా కొత్తకేసులు నమోదవుతున్నా..24 గంటల్లో సుమారు మూడువేలకు చేరువలో మరణాలు నమోదుకావటం గమనార్హం. ఇప్పటికీ మోడీ ప్రభుత్వం ఆశించినరీతిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవటంలేదన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతూనే ఉంది. తాజాగా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా కేసులు, 2,812 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల 1,73,13,163కు చేరగా, మరణాలు 1,95, 123కు పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 14,19,11,223 టీకాలు వేశారు. అలాగే, 27.93 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కఠిన ఆంక్షలతో పాటు నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా చర్యలు తీసుకున్నాయి. తాజాగా కరోనా పంజా కర్నాటకలో సైతం లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి మరో రెండు వారాల పాటు (14 రోజులు) లాక్డౌన్ విధిస్తున్నట్టు తాజాగా అధికార యంత్రాంగం ప్రకటించింది. లాక్‌డైన్ మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజులపాటు అమల్లో ఉంటుందని రాష్ట్ర సీఎం యడియూరప్ప ప్రకటించారు. గత 24 గంటల్లో కర్నాటకలో 34 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని బెంగు ళూరు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. కొత్త కేసుల్లో ఇక్కడే 20 వేలకు పైగా నమోదయ్యాయి.
కేరళలో వారాంతపు మినీ లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించ డానికి కేరళ ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రం లో లాక్డౌన్ విధించకూడాదని నిర్ణయించింది. అయితే, గత వారం అమలు చేసిన వారాంతపు మినీ లాక్ డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే, కరోనా పాజిటివిటీరేలు అధికంగా ఉన్నప్రాంతాల్లో మరిన్ని ఆంక్షలు విధించనున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో నైట్‌కర్ఫ్యూ
కరోనా ప్రభావం పెరుగుతుండటంతో ఇప్పటికే యూపీ, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ సైతం కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న కాంగ్రా, ఉనా, సోలన్, సిర్మౌర్ జిల్లాలో మంగళవారం నుంచి వచ్చే నెల 10 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది.