Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికైన అభ్యర్థుల విజయోత్సవ ఊరేగింపులపై భారత ఎన్నికల కమిషన్ మంగళవారం నిషేధం విధించింది. అలాగే ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత రిట్నరింగ్ అధికారి వద్ద ధృవీకరణ పత్రాన్ని తీసుకోవడానికి విజేతగా నిలిచిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. మే 2న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఆ రోజున, ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీలను ఈసీ నిషేధించింది. గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంటనే ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. భారత ఎన్నికల కమిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక రోజు తరువాత ఇసి ఈ నిషేధం ప్రకటించడం విశేషం. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించనున్న సంగతి తెలిసిందే. పశ్చి బెంగాల్లో ఇప్పటి వరకూ ఏడు దశల పోలింగ్ జరగ్గా, ఈ నెల 29న జరిగే ఎనిమిదో దశతో అక్కడ ఎన్నికలు ముగుస్తాయి. కాగా, ఇసి నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డా స్వాగతించారు.