Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటర్‌కు భారత హై కమిషన్ లేఖ
వాస్తవాలు నిర్ధారించుకోకుండా ప్రచురించారంటూ విమర్శ
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో భారత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ పలు అంతర్జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆస్ట్రేలియన్ వార్తాపత్రికను భారత ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. 'వైరస్‌తో భారతదేశం విధ్వంసమవుతున్నదనీ ఆరోపిస్తూ... ప్రధాని మోడీ పేలవమైన పనితీరును విమర్శిస్తూ ఓ వ్యాసాన్ని ఆస్ట్రేలియా వార్తా పత్రిక క్రిస్టియన్ డోరె ప్రచురించింది. దీనిపై ఆస్ట్రేలియాలోని భారత హై కమిషన్ కార్యాలయం ఆ పత్రిక సంపాదకులకు ఒక లేఖ రాసింది. కరోనా మహమ్మారి పట్ల భారత ప్రభుత్వ స్పందనకు విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుతుంటే ఈ వ్యాసం మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిని దెబ్బతీసేలా వుందని విమర్శించారు. నిరాధారమైన, తప్పుడు వార్తలతో కూడిన ఈ కథనాన్ని గౌరవప్రదమైన ఈ పత్రిక ప్రచురించడం విస్మయాన్ని కలిగిస్తున్నదని సంపాదకులకు పంపిన రిజాయిండర్లో భారత డిప్యూటీ హై కమిషనర్ పేర్కొన్నారు. అందులోని వివరాలు వాస్తవాలా కాదా అనే విషయాన్ని భారత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిర్ధారించుకోకుండానే ప్రచురించారని విమర్శించారు. భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరిగినందుకు మోడీ ఎన్నికల ప్రచారాన్ని, హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాను ప్రస్తావిస్తూ విమర్శించడం సరికాదని హై కమిషన్ పేర్కొంది. అయితే, బ్రిటన్‌కు చెందిన సండే టైమ్స్ పత్రికలో తొలుత ఈ వ్యాసం ప్రచురితమైంది. దాన్నే తిరిగి ఆస్ట్రేలియా పత్రిక పున:ప్రచురించింది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పత్రికనే లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఎందుకు స్పందించిందో స్పష్టంకాలేదు. పైగా ప్రభుత్వ పనితీరు, వ్యవహార శైలిని విమర్శిస్తూ అంతర్జాతీయంగా పలు కథనాలు వచ్చాయి. మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భారత్ మాజీ హై కమిషనర్, ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ బోర్డు సభ్యుడైన జాన్ మెకార్తె రాసిన వ్యాసాన్ని కూడా సోమవారం సిడ్నీమార్నింగ్ హెరాల్డ్ ప్రచురించింది.