Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో ఆరుబయట స్ట్రెచర్ మీదనే వైద్యం
- స్విమ్స్‌లో కరోనా బాధితుల దయనీయ స్థితి
తిరుపతి సిటీ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో తిరుపతిలోని స్విమ్స్ పద్మావతి హాస్పిటల్‌కు కోవిడ్ బాధితుల తాకిడి విపరీతంగా పెరిగింది. రాష్ట్ర కోవిడ్ కేంద్రంగా ఈ ఆస్పత్రి ఉండడంతో చిత్తూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల నుంచి పరిస్థితి తీవ్రంగా ఉన్న కరోనా రోగులను ఇక్కడికి పంపుతుంటారు. బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఆస్పత్రి ప్రాంగణంలో, ఆరుబయట బాధితులకు వైద్యం అందించాల్సిన దుస్థితి దాపురించింది.
మంగళవారం కనిపించిన కొన్ని దశ్యాలు సమస్య తీవ్రతకు, బెడ్ల కొరతకు అద్దం పడుతున్నాయి. ఈ ఆస్పత్రిలో 450 బెడ్లు అందుబాటులో ఉండేవి. అవి చాలకపోవడంతో సోమవారం నుంచి మరో ఆరు వార్డులను అందుబాటులోకి తెచ్చారు. కరోనా బాధితులు మంగళవారం ఉదయం అధిక సంఖ్యలో రావడంతో బెడ్ల కొరత తీవ్రమైంది. దీంతో, కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వైద్యులు వారికి ఆస్పత్రి ఆరుబయట చెట్ల నీడల్లో, రేకులు షెడ్లలో, వరండా ఆవరణలో స్ట్రెచర్, వీల్ చైర్లోనే రోగులను ఉంచి ఆక్సిజన్, అవసరమైన వైద్యం అందించారు. ఈ దృశ్యాలను చూసి ప్రజలు ఆవేదనకు గురయ్యారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ప్రభుత్వం బెడ్లు, కనీస వసతులు కల్పించాలని కరోనా బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.
మా వంతు ప్రయత్నం చేస్తున్నాం
ఆస్పత్రికి వచ్చే కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఆస్పత్రికి కేటాయించిన 450 బెడ్లు చాలకపోవడంతో మరో 570 బెడ్లు ఏర్పాటు చేశాం. రోజురోజుకు రోగుల తాకిడి పెరిగిపోతుండడంతో విశ్రాంతి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం.
-డాక్టర్ రామ్, మెడికల్ సూపరింటెండెంట్, స్విమ్స్