Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ బహిరంగ సభలతో కరోనా కేసులు పైపైకి..
- మొదటి దశ పోలింగ్‌కు ముందు..యాక్టీవ్ కేసుల సంఖ్య 3,380
- ఏడో దశ పోలింగ్‌నాటికి 95 వేలకు పెరిగిన కేసులు
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, కరోనా కేసుల సంఖ్య పెరుగుదలకు ఎలాంటి సంబంధముందో ప్రత్యక్ష ఉదాహరణగా పశ్చిమ బెంగాల్ కనపడుతోంది. ఓ వైపు దేశం యావత్తు కరోనా రెండో వేవ్‌తో విలవిల్లాడుతుంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంపై మోడీ సర్కార్ దృష్టిసారించింది. పెద్ద పెద్ద బహిరంగ సభలను నిర్వహించింది. ప్రధాని మోడీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నాయకులంతా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కోవిడ్-19 నిబంధనలు పక్కకుపోయాయి. ఫలితం..నేడు ఆ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఎన్నికలకు ముందు (మొదటి దశ పోలింగ్) ఆ రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 3,380 ఉంటే, ఏప్రిల్ 26 (ఏడో దశ పోలింగ్) నాటికి ఆ సంఖ్య 95వేలకు పెరిగింది. యాక్టీవ్ కేసుల పెరుగుదల 28 రేట్లు ఉంది. 34 రోజుల్లో ఎనిమిది దశల పోలింగ్‌కు ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించటం సర్వత్రా విమర్శలపాలైంది.
ప్రధాని మోడీ, అమిత్ షాల ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా ఉండటం కోసమే సుదీర్ఘమైన షెడ్యూల్‌ను విడుదల చేశారని పలు రాజకీయ పక్షాలు ఆరోపించాయి.
ఈసీకి ముందే లేఖ రాశాం : డాక్టర్ పుణ్యబ్రతా,
పశ్చిమ బెంగాల్ డాక్టర్స్ ఫోరం
మార్చి 20న రోజువారి కొత్త కేసుల సంఖ్య 383 ఉంటే ఏప్రిల్ 26 నాటికి ఆ సంఖ్య 15,992కు పెరిగింది. రోజువారీ కొత్త కేసుల నమోదు 40 రేట్లు పెరిగింది. దీని ప్రకారం కేసుల వృద్ధిలో దేశంలోనే పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. '' ఎన్నికలు నిర్వహించిన తీరే రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేదు '' అని పశ్చిమ బెంగాల్ డాక్టర్స్ ఫోరం కన్వినర్ డాక్టర్ పుణ్యబ్రతా అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో వైరస్‌పై పూర్తి నియంత్రణ ఉందని, ఎప్పుడైతే భారీ ఎన్నికల ర్యాలీలు మొదలయ్యాయో వైరస్ వ్యాప్తి పెరిగిందని ఆయన చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ముందే హెచ్చరించామని, లేఖ కూడా రాశామని, దానిని ఈసీ పెద్దగా పట్టించుకోలేదని ఆయన అన్నారు.