Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే 2,771 మంది మృతి
- ఒక్కరి నుంచి 406 మందికి వ్యాప్తి : కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా దేశంలో 2,772 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 3,23,144 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 1,76,36,307కు చేరగా, మరణాలు 1,97,894కు పెరిగాయి. ఇప్పటివరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 28,82,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, దేశలో ఇప్పటివరకు 14,52,71,186 మందికి టీకాలు అందించారు. అలాగే, 28,09,79,877 కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఒక్కరోజే 16,58,700 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఒక్కరి నుంచి 406 మందికి కరోనా వ్యాప్తి
కరోనా నిబంధనలు, సామాజిక దూరం పాటించకుండా ప్రజలు నడుచుకోవడం వల్ల ఒక్కరి నుంచి 30 రోజుల్లో 406 మంది కరోనా సోకుతుందని కేంద్రం తెలిపింది. కరోనా కట్టడికి కోవిడ్-19 నిబంధనలు పాటించడం అత్యంత కీలకమైన అంశమనీ, అందరూ వాటిని పాటించాలని పేర్కొంది. పలు వర్సిటీల అధ్యయనాలు ఇప్పటికే ఈ విషయంలో చేసిన హెచ్చరికలను ప్రస్తవించింది. ప్రజలు గుంపులు 50 శాతం తగ్గితే ఒక్కో కరోనా రోగి నుంచి 15 మందికి, 75 శాతానికి తగ్గితే కేవలం 2.5 మందికే సోకుతుందని తెలిపింది. అలాగే, మాస్కును సరిగా పెట్టుకోకపోయిన కోవిడ్-19 వ్యాప్తి 90 శాతం పెరిగే ముప్పుందన్నారు.
అసోంలో నైట్ కర్ఫ్యూ
కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, కంప్లీట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అసోం చేరింది. కేసులు పెరుగుతుండటంతో మంగళవారం నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, అత్యవసర సేవలకు సంబంధించిన వైద్యారోగ్య, ఫార్మా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది.
ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాలు
కరోనా వైరస్ మహారాష్ట్రలో మారణహౌం సృష్టిస్తోంది. ఒకటి కాడు రెండు కాదు ఏకంగా 22 కరోనా మృతదేహాలను ఒకేఒక్క అంబులెన్స్‌లో కుక్కి పంపించిన దారుణ ఘటన బీద్ జిల్లాలో చోటుచేసు కుంది. ఆ సమయంలో ఇదేమని అడిగిన మృతుల బంధు వులకు.. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా డెడ్‌బాడీలను తీసుకెళ్లినట్టు చెప్పారు. ''మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనా డెడ్‌బాడీలను అంతిమసంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు అప్పగించడం మా బాధ్యతనీ, వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం'' అని ఆస్పత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర అన్నారు.