Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంత్యక్రియలకూ వరుసగా...
- కరోనా టెస్టులకు లైన్లు.. ఆస్పత్రుల్లో చికిత్సకూ క్యూ..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం తాండవం చేస్తుంటే.. ఎటూ చూసినా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. కరోనా టెస్టుల కోసం క్యూ వైరస్ బారిన పడిన రోగులు ఆస్పత్రిలో చేరటానికి.. ఆస్పత్రిలో చేరాక బెడ్ల కోసం.. ఆఖరుకు ఆరోగ్యం క్షీణిస్తే.. రెమ్‌డెసివర్ మందు కోసం కూడా భారీ క్యూలైన్లు చూస్తున్నాం. చివరికి కోవిడ్ కోరల్లో చిక్కి చనిపోయిన వారి దహనసంస్కారాల కోసం శ్మశానవాటికల్లోనూ భారీ క్యూలైన్లు తప్పటంలేదు.
దేశంలో ఒక రాష్ట్రం.. ఒక మహానగరం.. ఒక హాస్పిటల్ అనే తేడాలేదు. ప్రతీచోటా కరోనా పేషెంట్లు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్ సహ రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ.. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించటానికి భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
లక్నోలోని లోహియా హాస్పిటల్
కరోనా పరీక్షలు నిర్వహించడానికి జనం తరలివచ్చారు. కరోనా ఉన్నదా..లేదా అని పరీక్షించుకోవటానికి క్యూ కట్టారు.దేశవ్యాప్తంగా 14.5 కోట్లమందికి పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం ధ్రువీకరిస్తున్నది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఆస్పత్రి
ఆస్పత్రి లోపల పడకలు ఖాళీగాలేవు. దీంతో వెలుపల అంబులెన్స్ లైన్ ఏర్పాటు చేశారు. అందులోనే కరోనా రోగులను ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో ఖాళీ ఉంటే వరుసగా ఉన్న అంబులెన్స్‌లోని పేషెంట్లను అనుమతిస్తున్నారు.
ఢిల్లీలో ఆక్సిజన్ నిల్
ఢిిల్లీ ఆస్పత్రులలో ఆక్సిజన్ లేదు. కేంద్రం నిస్సహాయతను ఢిల్లీ కోర్టు మందలించినా మార్పురాలేదు. రోగులకు ఆక్సిజన్ అందకపోవటంతో.. వారి బంధువులే ఖాళీ సిలిండర్లతో రీఫిల్ సెంటర్ వెలుపల వరుసలు కడుతున్నారు. ఈ నిరీక్షణలో పలువురి శ్వాసలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
శ్మశానవాటికల వద్ద క్యూ..
శ్మశానవాటికల వద్ద క్యూలైన్లు దడపుట్టిస్తున్నాయి.దహనసంస్కారాలు నిర్వహించటానికి టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. శవాలను తెచ్చిన బంధువులు గంటలతరబడి ఎదురుచూడకతప్పటంలేదు.