Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి : రాజకీయ విశ్లేషకులు
- రెండో వేవ్ ఆపగలిగివుంటే..ఆర్థికంగా ముందుకెళ్లగలిగేవాళ్లం
- దిక్కులేనివారవుతున్న పేదలు, మధ్యతరగతి
కరోనా సంక్షోభానికి విలవిల్లాడుతున్న మనదేశాన్ని చూసి..ప్రపంచ దేశాలు 'అయ్యో పాపం..' అంటున్నాయి. మా కడుపు తరక్కుపోతోంది, మా హృదయం ముక్కలైంది..అని ప్రపంచదేశాలు, దేశవిదేశాల్లోని పలువురు ప్రముఖులు(జర్మనీ ఛాన్స్లర్ మెర్కెల్, సత్యనాదెళ్ల, అమెరికా సెనెట్ సభ్యులు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగుల చికిత్సకు అవసరమయ్యే వైద్య సామగ్రి పంపుతామని అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఇంత జరుగుతున్నా దేశ ప్రధాని మోడీ మాత్రం పైపై నిర్ణయాలతో కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఒక సునామీలా వైరస్ దేశ ప్రజలపై విరుచుకుపడుతున్నది. ఈ పెను విపత్తు నుంచి దేశ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్రమోడీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానిది. అయితే ఈ పెను ముప్పు నుంచి ఆయనగానీ, కేంద్రంగానీ కాపాడుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదు. మొత్తంగా ఆయన నాయకత్వంపైనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, దేశం యావత్తు ఓ వైపు వైరస్ దెబ్బకు విలవిల్లాడుతుంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ప్రధాని మోడీ దృష్టిసారించడంపై అనేకమంది ఆగ్రహించిన విషయం తెలిసిందే. అసన్సోల్ (పశ్చిమ బెంగాల్) బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ''ఇంత భారీ సంఖ్యలో హాజరైన సభను నేను ఎక్కడా చూడలేదు'' అని ప్రధాని మోడీ ఆ సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ బహిరంగ సభల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేయలేదు.
కరోనా వైరస్ రెండో దశ విజృంభణతో ఆక్సీజన్, ఔషధాలు, బెడ్లు లేక..గేట్ల వద్దే పేషంట్ల ప్రాణాలు పోతున్న ఉదంతాలు వార్తా పత్రికల్లో వస్తున్నాయి. 'ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదని' ఎంతోమంది వైద్యులు సామాజిక మాధ్యమంలో వీడియో సందేశాలు పెడుతున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభం మొదలయ్యాక, మీటింగల మీద మీటింగులు మోడీ నేతృత్వంలో జరిగాయి. ప్రజా ఆరోగ్యంపైనా ఎన్నో సమీక్షలు చేసినట్టు ప్రధాన మీడి యాలో వార్తా కథనాలు వచ్చాయి. లెక్కలేనన్నిసార్లు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. వైద్య నిపుణులు, రాజకీయ ప్రముఖులు..ఇలా అన్ని రంగాలవారితో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వ హించారు. ఇదంతా కేవలం మీడియాలో చూపించుకోవడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజారోగ్యంను బలోపేతం చేసుకోవటం కోసం చేయాల్సిన చర్యలేమీ తీసుకోలేదని, కేవలం మీడియా మేనేజ్మేంట్లో భాగంగానే అదంతా జరిగిందని వారు విమర్శిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తే..ఎలాంటి మందులు అవసరం ఉంటుందో కూడా కేంద్రానికి తెలియదా? తెలిస్తే..ఎందుకు సిద్ధం చేయలేదు? రాష్ట్రాలకు ఎందుకు అందజేయలేదు? అని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం సరైన చర్యలు చేపట్టకపోవటం వల్లే నేడు ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని న్యూఢిల్లీ రెండూ వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి.
మోడీ సర్కార్ వద్దు : పంచానన్ మహారానా, సామాజిక కార్యకర్త, ఒడిషా
గతంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని సమర్థించాను. ఆయన '' పనితనం '' చూశాక..తప్పుచేశానని అనుకుంటున్నా. మరో పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్నా. సంక్షోభ సమయాన దేశానికి నాయకత్వం వహించటంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు. సందేశాలు, ప్రసంగాలు కాకుండా, ప్రజల ప్రాణాల్ని కాపాడే చర్యలు చేపట్టాలి. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీని ప్రజలు ఎంచుకోవాలి.
ప్రజా ఆగ్రహాన్ని లెక్క చేయటం లేదు.. : నికితా సూద్, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో భారత్ వైఫల్యం చెందింది. ప్రజా ఆగ్రహాన్ని కేంద్రం పెద్దగా లెక్క చేయటం లేదు. ప్రజల కోపం ఎన్నాండ్లు ఉంటుంది? కొద్ది రోజుల్లో అదే తగ్గిపోతుందనే భావనలో మోడీ సర్కార్ ఉంది. ఇదంతా కూడా ఎన్నికలకు ఏమైనా ఉపయోగపడుతుందా? అని పాలకులు ఆలోచిస్తున్నారు.
మోడీ ఎత్తుగడ వికటించింది.. : సంజయ్ కుమార్, ఎన్నికల విశ్లేషకుడు కఠినమైన లాక్డౌన్, నియంతణ్ర చర్యల వల్లే వైరస్ మొదటివేవ్ నుంచి దేశం బయటపడిందని మోడీ సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంది. మరి రెండోవేవ్ను అడ్డుకోక వైఫల్యం చెందటం..ఎవరి వల్ల జరిగింది? కేంద్రంలోని పాలకుల వాదనను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదు.
ఆర్థికంగా మరింత పతనం
కరోనా రెండో వేవ్‌ను కొంతమేరకు ఆపగలిగివుంటే, దేశం ఆర్థికంగా ముందుకెళ్లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వైరస్ ఉధృతి చేయిదాటిపోవటంతో..ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం పాలకుల విధానాలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలు, సామాన్యలు, మధ్య తరగతి ఉపాధి సంగతి ఎలా ? అన్నది చెప్పటం లేదు. ఏప్రిల్ 18నాటికి పట్టణ నిరుద్యోగం 10.72శాతానికి పెరిగిందని సీఎంఐఈ తాజా నివేదిక తెలిపింది.